మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు రంగం సిద్ధం: నేడు వీడియో కాన్ఫరెన్స్, వచ్చే నెల రెండో వారంలో పోలింగ్

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మంగళవారం ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం సిద్ధమైంది. షెడ్యూల్ విడుదలకు ముందు నేడు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని సమీక్షించనున్నారు. అనంతరం ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మున్సిపల్ శాఖ కార్యదర్శులతో ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశాల అనంతరం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉందని సమాచారం.

వచ్చే నెల రెండో వారంలో మున్సిపల్ ఎన్నికలు జరగనున్నట్లు అధికారులు తెలిపారు. షెడ్యూల్ విడుదలైన 15 రోజుల్లోనే మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఎన్నికల సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను జిల్లా యంత్రాంగం ఇప్పటికే పూర్తి చేసినట్లు వెల్లడించింది

రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలోని మొత్తం 2996 వార్డులు, డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో సుమారు 52 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇప్పటికే రిజర్వేషన్ల జాబితను రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సంఘానికి పంపించింది. రిజర్వేషన్లు ఖరారైన తర్వాత షెడ్యూల్ విడుదల అవుతుందని అధికారులు గుర్తు చేస్తున్నారు.

రిజర్వేషన్లు, షెడ్యూల్ విడుదల మధ్య ఎక్కువ గ్యాప్ రావడంతో ఓటర్ జాబితా, రిజర్వేషన్లపై కోర్టుల్లో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఇదిలా ఉండగా ఎన్నికలకు అవసరమైన బ్యాలెట్ పేపర్లు రాష్ట్రానికి చేరుకున్నాయి. ఇప్పటికే 16 జిల్లాలకు బ్యాలెట్ పేపర్లు పంపించగా, మిగతా 16 జిల్లాలకు నేడు సరఫరా చేయనున్నారు. ఇందుకు అవసరమైన ఇంక్ కూడా జిల్లాలకు చేరినట్లు సమాచారం.

మున్సిపల్ ఎన్నికలను అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీ, బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. పార్టీ గుర్తులపై ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తమ సత్తా చాటేందుకు ప్రధాన పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధికార పార్టీ ఈసారి ఏకపక్షంగా గెలవాలనే లక్ష్యంతో మంత్రులను ఇన్‌చార్జ్‌లుగా నియమించింది. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో సీఎం ప్రచారం పూర్తి చేయగా, అమెరికా నుంచి తిరిగి వచ్చిన వెంటనే ఫిబ్రవరి నుంచి మరోసారి జిల్లాల పర్యటనలు, బహిరంగ సభలు నిర్వహించనున్నట్లు సమాచారం.

అయితే, క్షేత్రస్థాయిలో పార్టీ నేతలు, ఇన్‌చార్జ్ మంత్రుల చురుకుదనం కనిపించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. మూడు ప్రధాన పార్టీలు ఎన్నికలను పూర్తిస్థాయిలో సీరియస్‌గా తీసుకోవడం లేదని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజల్లోకి వెళ్లి చెప్పేందుకు ఏం లేదన్న భావనతో పార్టీలు అయోమయానికి లోనవుతున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *