కేంద్ర–రాష్ట్ర ప్రభుత్వాలు బీసీలను మోసం చేస్తున్నాయి: 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు – బీసీ జేఏసీ డిమాండ్

బీసీలకు జరుగుతున్న అన్యాయాలపై ఎండగట్టేందుకే ఈ రోజు మీడియా సమావేశం నిర్వహించామని బీసీ జేఏసీ నేతలు స్పష్టం చేశారు. కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ – రెండు ప్రభుత్వాలు కూడా బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు.

రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు బీసీలకు హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత 42 శాతం రిజర్వేషన్ల అమలును విస్మరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికలకు ముందుకు వెళ్తోందని విమర్శించారు. రెండు సంవత్సరాలుగా బీసీ సమాజాన్ని నమ్మించి చివరకు మొండి వైఖరితో ఎన్నికలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.

మరోవైపు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా జనగణనలో కులగణన చేస్తామని చెప్పి, తాజాగా విడుదల చేసిన ఫార్మాట్‌లో ఓబీసీ/బీసీ/ఈబీసీ అనే కాలమ్‌ను తొలగించి, కేవలం ఎస్సీ, ఎస్టీ, అదర్స్ అని మాత్రమే పేర్కొనడం ద్వారా మరోసారి బీసీలను మోసం చేసిందని బీసీ జేఏసీ నేతలు ఆరోపించారు. ఇది కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలకు విరుద్ధమని అన్నారు.

ఈ సమావేశంలో బీసీ జేఏసీ చైర్మన్ గౌరవనీయులు గాజుల శ్రీనివాస్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. గత రెండు సంవత్సరాలుగా బీసీల కులగణన, స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల కోసం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలపై నిరంతరం ఒత్తిడి తెస్తున్నామని తెలిపారు. అయినప్పటికీ రెండు ప్రభుత్వాలు కూడా మొండి వైఖరితో ముందుకు వెళ్తున్నాయని విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ, రాహుల్ గాంధీ మాటకు విలువ ఉంటే తెలంగాణలో 42% రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో సంవత్సరాల పాటు స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేసిన ఉదాహరణలు ఉన్నప్పుడు, బీసీలకు న్యాయం చేయడానికి రెండు మూడు నెలలు ఆగితే నష్టం ఏమిటని ప్రశ్నించారు.

బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా చూస్తున్న రాజకీయ వైఖరిని ఇక సహించబోమని బీసీ జేఏసీ స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం జనగణనలో ప్రతి బీసీ కులానికి ప్రత్యేక కాలమ్ చేర్చాలని, రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేసింది.

ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే ఢిల్లీ కేంద్రంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. బీసీ సమాజం అంతా ఏకమై, పార్టీ భేదాలు లేకుండా బీసీ అభ్యర్థులకే ఓటు వేసి గెలిపించుకోవాలని బీసీ జేఏసీ పిలుపునిచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *