నేషనల్ హెరాల్డ్ కేసును కేంద్రంగా చేసుకుని దేశవ్యాప్తంగా కాంగ్రెస్ – బీజేపీ మధ్య రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఓకే టీవీతో మాట్లాడిన కాంగ్రెస్ నేత చరణ్ కౌశిక్, బీజేపీ ప్రభుత్వం ఈడీ, సీబీఐ, ఇన్కమ్ ట్యాక్స్ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ఆయుధాలుగా ఉపయోగిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశారు.
నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలపై పెట్టిన ఈడీ కేసులను ఢిల్లీ హైకోర్టు తప్పుపట్టిన నేపథ్యంలో, ఆ విషయాన్ని దేశ ప్రజలకు వివరించే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముందు శాంతియుత నిరసనలు చేపట్టిందని ఆయన స్పష్టం చేశారు. ఈ నిరసన ఏఐసీసీ పిలుపు మేరకే జరిగిందని, ఇందులో టీపీసీసీ అధ్యక్షుడు కూడా పాల్గొన్నారని తెలిపారు.
బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ప్రతిపక్ష నాయకుడిపై ఈడీ కేసులు పెట్టడం అలవాటుగా మారిందని చరణ్ కౌశిక్ విమర్శించారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, మమతా బెనర్జీ, స్టాలిన్, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వంటి నాయకులపై కేసులు పెట్టిన ఉదాహరణలను గుర్తు చేశారు. అయితే బీజేపీలో చేరిన వెంటనే కేసులు నెమ్మదించడమో, పూర్తిగా ఆగిపోవడమో జరుగుతోందని ఆరోపించారు.
అశోక్ చౌహాన్, గాలి జనార్ధన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి కేసుల ఉదాహరణలు చూపిస్తూ, బీజేపీకి మద్దతు ఇస్తే దర్యాప్తు సంస్థలు నిశ్శబ్దంగా మారుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. అయోధ్య కేసుకు 19 సంవత్సరాలు పట్టిన విషయాన్ని, జగన్‌పై కేసులు దశాబ్దంగా కదలని పరిస్థితిని ప్రస్తావిస్తూ, న్యాయవ్యవస్థను రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారని అన్నారు.
మహాత్మా గాంధీ పేరుతో ఉన్న పథకాల పేరు మార్పుపై కూడా ఆయన తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గాంధీ పేరుతో ఉన్న నరేగా పథకాన్ని పేరు మార్చడమే కాకుండా, నిబంధనలను సైతం బీజేపీ ప్రభుత్వం మార్చిందని ఆరోపించారు. గాంధీ రామభక్తుడని, ఆయన పేరు తొలగించి రాముడి పేరుతో రాజకీయాలు చేయడం సరైంది కాదని స్పష్టం చేశారు. దేవుడు ఎప్పుడూ భక్తుల కోసం త్యాగం చేస్తాడని, భక్తుల పేర్లు తొలగించమని చెప్పడని వ్యాఖ్యానించారు.
పార్టీ ఫిరాయింపుల అంశంపై స్పందించిన చరణ్ కౌశిక్, గతంలో బీజేపీ 58 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎంఎల్సీలను ఇతర పార్టీల నుంచి చేర్చుకున్న విషయాన్ని గుర్తు చేశారు. రాజ్యాంగం అప్పుడూ ఇదే, ఇప్పుడూ ఇదేనని, అప్పుడు చట్టం వర్తించలేదా అని ప్రశ్నించారు. స్పీకర్‌కు రాజ్యాంగబద్ధమైన అధికారాలు ఉన్నాయని, ఆయనను ప్రశ్నించడం సరికాదని అన్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణలో ఉపఎన్నికలు వచ్చే అవకాశమే లేదని, ఇది పూర్తిగా రాజకీయ రాద్ధాంతమేనని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. బీజేపీ ఎంత బెదిరింపులకు పాల్పడ్డా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో ప్రజల ముందుకు వెళ్లి పోరాటం కొనసాగిస్తుందని ఆయన తేల్చిచెప్పారు.

