నిజాంసాగర్ కాల్వల దుస్థితిపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ ఫైర్‌

నిజాంసాగర్ కాల్వల ఆధునీకరణపై అసెంబ్లీలో ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారి ఆవేదన

తెలంగాణ శాసనసభలో నీటి పారుదల శాఖపై జరిగిన చర్చలో ఆర్మూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే రాకేష్ గారు నిజాంసాగర్ ప్రాజెక్టు పరిస్థితిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్మూర్ నియోజకవర్గంలో రెండు సంవత్సరాల క్రితం లైనింగ్‌కు మంజూరైన రూ.22 కోట్ల పనులు ఇప్పటికీ ప్రారంభం కాకపోవడం, లంబాడీ తండాల్లో నిజాంసాగర్ కాల్వకు సంబంధించిన ఎత్తిపోతల పథకానికి రూ.7 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉండటాన్ని ఆయన ప్రస్తావించారు.

అలాగే, 2016 నుంచే మోటార్లు కాలిపోయి ఉన్నప్పటికీ ఇప్పటివరకు వాటి రీప్లేస్‌మెంట్ జరగలేదని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఇవి వేల కోట్ల రూపాయల ప్రాజెక్టులు కాదని, చిన్న మొత్తాలతో పరిష్కరించగల సమస్యలేనని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రెండు సంవత్సరాలుగా నీటి పారుదల శాఖ మంత్రిని సుమారు 20 సార్లు కలిశానని, అయినప్పటికీ సమస్యలు పరిష్కారం కాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు.

నిజాంసాగర్ ప్రాజెక్టు స్వాతంత్ర్యం రాకముందే నిర్మించబడినదని, ప్రస్తుతం డిస్ట్రిబ్యూటరీ కాల్వలు, మెయిన్ కాల్వలు పూర్తిగా ధ్వంసమై ఉన్నాయని ఆయన వివరించారు. గత ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలతో కొత్త ప్రాజెక్టులు చేపట్టినప్పటికీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోనూ, తెలంగాణలోనూ అత్యధికంగా నష్టపోయిన జిల్లా నిజామాబాద్ ఒక్కటేనని ఎమ్మెల్యే రాకేష్ పేర్కొన్నారు.

నిజామాబాద్ జిల్లాలో కాల్వల పునరుద్ధరణ, లైనింగ్, ఆధునీకరణకు కనీసం రూ.2000 కోట్లు అవసరమని, అందులో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గంలో మదనపల్లి నుంచి వడితే పత్తేపాటి వరకు కాల్వలను ఆధునీకరించేందుకు రూ.1500 కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్ చేశారు. భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి వంటి సీనియర్ మంత్రులతో కూడిన కమిటీ ఉత్తర తెలంగాణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని కోరారు.

శ్రీరామసాగర్‌కు సంబంధించిన ఫైల్‌పై 2024 జనవరిలో సంతకం జరిగినప్పటికీ, ఇప్పటివరకు ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని ఎమ్మెల్యే విమర్శించారు. వేల కోట్లను కాదు, వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్న రైతుల కోసం అవసరమైన న్యాయమైన వాటాను మాత్రమే అడుగుతున్నామని చెప్పారు.

కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులు అవసరమైతే మళ్లీ నిర్మించుకోవచ్చని, కానీ నిజామాబాద్ జిల్లాను మాత్రం నిర్లక్ష్యం చేయవద్దని, ముఖ్యమంత్రి గారు మరియు సీనియర్ మంత్రులు ప్రత్యేకంగా ఈ జిల్లాపై దృష్టి పెట్టాలని ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ గారు సభాముఖంగా విజ్ఞప్తి చేశారు. నిజాంసాగర్ ఆధునీకరణకు తక్షణమే నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలని కోరుతూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *