ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న పంచాయతీ ఎన్నికల నగారా ఈరోజు మోగబోతోంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తూ, నామినేషన్ల దాఖలు కోసం అక్టోబర్ 11 వరకు గడువు ఇచ్చింది. ఇదిలా ఉంటే, బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో నేడు కీలక విచారణ కొనసాగుతోంది. నిన్న వాదనలు సాయంత్రం వరకు సాగగా, పిటిషనర్లు బీసీ రిజర్వేషన్లపై స్టే కోరినప్పటికీ, హైకోర్టు ఆ విజ్ఞప్తిని తిరస్కరించింది.
ప్రభుత్వ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింగ్వి వాదిస్తూ — “సుప్రీం కోర్టు ఆదేశం తప్ప 50% రిజర్వేషన్‌లకు రాజ్యాంగ పరిమితి లేదు. ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు ఇచ్చిన ఉదాహరణ స్పష్టంగా ఉంది” అని పేర్కొన్నారు. అయితే, పిటిషనర్లు ఎన్నికల ప్రక్రియను నిలిపివేయాలని కోరగా, హైకోర్టు దానికి సమ్మతించలేదు.
ఇక నేడు కూడా హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగే అవకాశం ఉంది. ఒకవైపు పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కాగా, మరోవైపు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు కోసం అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ బీ ఫార్ముల జారీని తీర్పు తర్వాతకు వాయిదా వేస్తుండగా, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు కూడా పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా ఈ తీర్పు రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉందనే అంచనా వ్యక్తమవుతోంది. సుప్రీం కోర్టు 50% రిజర్వేషన్ పరిమితిని మించరాదన్న తీర్పు ఉన్నప్పటికీ, హైకోర్టు తుది తీర్పు ఏ దిశలో వెళ్తుందో చూడాలి.

