పైరసీ సైట్లకు అడ్డుకట్ట పడేనా? iBomma అరెస్ట్‌తో మళ్లీ హాట్ టాపిక్ అయిన సినిమా భద్రత

తెలుగు చిత్ర పరిశ్రమను గత కొన్నేళ్లుగా తీవ్రంగా వేధిస్తున్న సమస్యల్లో పైరసీ అగ్రస్థానంలో నిలుస్తోంది. థియేటర్లలో కొత్తగా రిలీజ్ అయ్యే సినిమాలు అదే రోజుకి పైరసీ వెబ్‌సైట్లలో అందుబాటులోకి రావడం నిర్మాతలకు కోట్ల రూపాయల నష్టం కలిగించడమే కాక, ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీ ఆదాయం కోల్పోవడానికి కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల iBomma‌కు చెందిన ఇమ్మడి రవి అరెస్టు కావడం, ఈ సమస్యను మళ్లీ హాట్ టాపిక్‌గా మార్చింది.

పోలీసులు రవిని ఎలా ట్రాక్ చేసి పట్టుకున్నారనే వివరాలు సజ్జనార్ వెల్లడించడంతో సినిమా ఇండస్ట్రీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. ఈ చర్యకు సినీ ప్రముఖులు ప్రశంసలు కురిపించినా, ఒక న్యాయవాది రవిని వారం రోజుల్లో బయటకు తీసుకువస్తానని ప్రకటించడం మరింత వివాదాన్ని రేపింది. అతని మాటల్లో— “రవికి ప్రజల్లో మంచి మద్దతు ఉంది, అందుకే నేను ముందుకొచ్చాను”—అని చెప్పడం ఆశ్చర్యకరమే.

ఇన్ని వాదోపవాదాల మధ్య అసలు ప్రశ్నపై ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. నిర్మాతలు పైరసీ వల్ల కోల్పోయిన నష్టాల వివరాలు, సాక్ష్యాలు, పిర్యాదులను సేకరించి సుప్రీం కోర్టులో కేసు వేశారా? దిల్ రాజు, లేదా కేంద్రంలో ప్రభావం ఉన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వంటి నేతలు ఈ అంశంపై ఎంతగా చర్యలు తీసుకున్నారు?

దేశ భద్రతకు ముప్పు కలిగించే పాకిస్తాన్‌కు చెందిన అనేక న్యూస్ ఛానెల్స్, యూట్యూబ్ ఖాతాలను ప్రభుత్వం తక్షణమే బ్లాక్ చేసిన ఉదాహరణ మన ముందుంది. అప్పుడు అదే విధంగా సినిమా పైరసీ సైట్లను దేశవ్యాప్తంగా పూర్తిగా బ్లాక్ చేయడం ఎందుకు కుదరడం లేదు?

పోలీసుల ప్రకారం పైరసీ సైట్లలో అక్రమ బెట్టింగ్ యాప్‌ల ప్రకటనలు ఉంటాయి, వినియోగదారుల డేటాను దొంగిలించి డార్క్ వెబ్‌లో విక్రయిస్తారు, సైబర్ నేరాలకు ఇది తలుపులు తెరవడం సహజం. ఈ ప్రమాదాన్ని పోలీసులు స్వయంగా చెబుతున్నప్పటికీ, ప్రభుత్వం “సుమోటో”గా ఇవన్నీ బ్లాక్ చేయకపోవడం ఆశ్చర్యకరం.

ఒక iBomma నిర్వాహకుడిని పట్టుకోవడం మాత్రమే సరిపోదు. ఇలాంటి డజన్ల కొద్ది సైట్లు ఉన్నాయి. వాటిని దేశవ్యాప్తంగా ఒకేసారి చట్టపరంగా మూసివేయడానికి ప్రభుత్వానికి అధికారాలు లేవా? సమస్య మూలాన్ని అరికట్టే విధంగా కఠిన చర్యలు తీసుకోవడం అత్యవసరం. పైరసీ పూర్తిగా నిలిచిపోవాలంటే, అధికారులు, ప్రభుత్వం, కోర్టులు మరియు సినీ పరిశ్రమ కలిసికట్టుగా బలమైన నిర్ణయాలు తీసుకోవాల్సిందే. ఈ ప్రశ్నకు నిపుణుల నుంచి స్పష్టమైన సమాధానం వచ్చే వరకు ప్రజల్లో సందేహాలు తొలగవు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *