ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో స్టైఫండ్ దగాట: 25 వేల స్థానంలో 2 వేలే!

తెలంగాణలోని ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో వైద్య విద్యార్థులకు ఇవ్వాల్సిన స్టైఫండ్ విషయంలో భారీ అవకతవకలు వెలుగులోకి వచ్చాయి. కొన్ని కాలేజీలు అసలు స్టైఫండ్ ఇవ్వడమే లేదని, మరికొన్ని కాలేజీలు నిబంధనల ప్రకారం చెల్లించాల్సిన మొత్తానికి బదులుగా నామమాత్రపు మొత్తాలు మాత్రమే ఇస్తున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఎన్‌ఎంసీ (నేషనల్ మెడికల్ కమిషన్) 2024–25 నివేదిక ప్రకారం పీజీ విద్యార్థులకు చెల్లించాల్సిన రూ.58,289 స్టైఫండ్‌ను సగానికి పైగా ప్రైవేట్ కాలేజీలు ఎగ్గొడుతున్నట్లు వెల్లడైంది. కాగితాలపై మాత్రం స్టైఫండ్ సక్రమంగా చెల్లిస్తున్నట్లు చూపించి, ఎన్‌ఎంసీకి తప్పుడు నివేదికలు పంపుతున్నారని ఫోరం ప్రతినిధులు ఆరోపిస్తున్నారు.

కామినేని నార్కట్‌పల్లి, సురభి (సిద్దిపేట), పట్నం మహేందర్ రెడ్డి (చేవెళ్ల), అయన్ (రంగారెడ్డి), మల్లారెడ్డి, డాక్టర్ వీఆర్‌కే సదన్ ఇనిస్టిట్యూట్‌ల్లో ఒక్క రూపాయి కూడా స్టైఫండ్ చెల్లించకుండా విద్యార్థులతో గంటల తరబడి పనిచేయిస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎంఎన్ఆర్ మెడికల్ కాలేజ్ రూ.2,080, భాస్కర్ మరియు మమత మెడికల్ కాలేజీలు రూ.2,000 మాత్రమే చెల్లిస్తుండగా, అపోలో మెడిసిటీ, చెల్మెడ, ఆనందరావు మెడికల్ కాలేజీలు కేవలం రూ.5,000 మాత్రమే ఇస్తున్నట్లు సమాచారం.

రాష్ట్ర ప్రభుత్వం 2025 జూన్‌లో వైద్య విద్యార్థుల స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతూ జీవో జారీ చేసింది. దాని ప్రకారం హౌస్ సర్జన్లకు రూ.29,792, పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు రూ.67,032 చెల్లించాల్సి ఉంది. అయితే పెరిగిన స్టైఫండ్ అమలు కాగితాలకే పరిమితమైందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

స్టైఫండ్ చెల్లింపులను పర్యవేక్షించాల్సిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్, ఆరోగ్య విద్య విశ్వవిద్యాలయ అధికారులు ఇది తమ బాధ్యత కాదంటూ తప్పించుకుంటున్నారని హెచ్‌సీఎఫ్, యూడీఎఫ్ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఆర్టీఐలో అడిగిన ప్రశ్నలకు “కాలేజీ ప్రిన్సిపాల్‌ను అడగండి” అని సమాధానం ఇవ్వడం వ్యవస్థలోని డొల్లతనాన్ని బయటపెడుతోందని వారు విమర్శిస్తున్నారు.

ఫీజుల దోపిడీపై ప్రభుత్వం వేసిన ప్రత్యేక కమిటీ పరిధిలోకి ఈ స్టైఫండ్ అంశాన్ని కూడా చేర్చి సమగ్ర విచారణ జరపాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. స్టైఫండ్ చెల్లించని ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై కఠిన చర్యలు తీసుకుంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందని కన్వీనర్ ఎం.శ్రీనివాస్ పేర్కొన్నారు

25 వేల స్టైఫండ్ ఇవ్వాల్సిన చోట కేవలం 2 వేలే ఇస్తూ, అంతా సక్రమంగానే ఉందని ఎన్‌ఎంసీకి తప్పుడు నివేదికలు పంపడం తీవ్రమైన నేరమని వారు తెలిపారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి ప్రైవేట్ మెడికల్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *