పెళ్లి పీటలెక్కనున్న ప్రియాంక గాంధీ కొడుకు రేహాన్ వాద్రా.. ఎంగేజ్‌మెంట్ వార్తలు వైరల్

కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంక గాంధీ కుమారుడు రేహాన్ వాద్రా త్వరలో పెళ్లి పీటలెక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఆయనకు ఎంగేజ్‌మెంట్ జరిగినట్లు జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. రేహాన్ తన స్నేహితురాలు అవీవా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్నట్లు సమాచారం.

ఇటీవల అవీవా బేగ్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రేహాన్‌తో కలిసి దిగిన ఫొటోను షేర్ చేశారు. ఆ తర్వాత అదే ఫొటోను హైలెట్స్ సెక్షన్‌లో ఉంచడంతో వీరిద్దరి మధ్య ఎంగేజ్‌మెంట్ జరిగిందనే ప్రచారం మరింత ఊపందుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. రేహాన్, అవీవా గత ఏడేళ్లుగా స్నేహితులు. ఈ పరిచయం క్రమంగా ప్రేమగా మారింది. ఇటీవల రేహాన్ అవీవాకు పెళ్లి ప్రపోసల్ చేయగా ఆమె అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇరుకుటుంబాలు ఈ లవ్ మ్యారేజ్‌కు అంగీకరించి ఎంగేజ్‌మెంట్ జరిపినట్లు కథనాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ప్రియాంక గాంధీ లేదా రాబర్ట్ వాద్రా నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

అవీవా కుటుంబ సభ్యులు ఢిల్లీకి చెందినవారని, వాద్రా కుటుంబంతో వారికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని సమాచారం. రేహాన్ వాద్రా ఒక విజువల్ ఆర్టిస్ట్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్ట్రీట్, కమర్షియల్, వైల్డ్‌లైఫ్ ఫొటోగ్రఫీలో ఆయనకు మంచి అనుభవం ఉంది. 2021లో ఢిల్లీలోని బికనేర్ హౌస్‌లో ‘డార్క్ పర్సెప్షన్’ పేరుతో తన తొలి ఫొటోగ్రఫీ ఎగ్జిబిషన్‌ను నిర్వహించారు.

మరో విశేషం ఏమిటంటే అవీవా బేగ్ కూడా ఒక ప్రొఫెషనల్ ఫొటోగ్రాఫర్. ఆమె ఓపీ జిందాల్ గ్లోబల్ యూనివర్సిటీ నుంచి జర్నలిజం అండ్ కమ్యూనికేషన్స్‌లో విద్య పూర్తి చేశారు. అంతేకాదు, ఒక ఫొటోగ్రఫీ స్టూడియో, ప్రొడక్షన్ సంస్థకు కో-ఫౌండర్‌గా కూడా పనిచేస్తున్నారు.

ఇప్పుడు ఈ ఎంగేజ్‌మెంట్ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండటంతో రేహాన్ – అవీవా వివాహంపై రాజకీయ, సెలబ్రిటీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *