నిన్న రేవంత్ రెడ్డి బావమరిది భాగవతాన్ని బహిర్గతం చేస్తే, అదే రోజున సాయంత్రానికి తనకు నోటీసులు పంపారని సిద్దిపేటకు చెందిన నేత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ నోటీసులు పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో పంపినవేనని ఆయన ఆరోపించారు.
ఆయన మాట్లాడుతూ..
“నిన్న రాత్రి దాదాపు 9 గంటల సమయంలో మా ఇంటి వద్ద మా మెయిడ్‌కు నోటీసులు ఇచ్చి వెళ్లారు. ఆ సమయంలో నేను సిద్దిపేట నియోజకవర్గంలో నా ప్రజలతో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అయినప్పటికీ ఉదయం 11 గంటలకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు” అని తెలిపారు.
తాను హైదరాబాద్‌లో లేనప్పటికీ, చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా రాత్రికి రాత్రే హైదరాబాద్ చేరుకొని నోటీసు మేరకు హాజరవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.
“మాకు చట్టం మీద గౌరవం ఉంది, న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉంది. మేము ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే భయపడే ప్రశ్నే లేదు” అని స్పష్టం చేశారు.
రేవంత్ రెడ్డి పంపిన నోటీసులు బెదిరింపుల కోసమేనని ఆరోపించారు.
“రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు మేము బెదిరే ప్రసక్తే లేదు. నిన్న ఆయన బావమరిది భాగవతాన్ని ఉదయాన్నే బయట పెట్టాం. దానిపై ఇప్పటివరకు ఒక్క మంత్రి గానీ, ప్రభుత్వం నుంచి గానీ స్పందన లేదు” అని అన్నారు.
అన్ని ఆధారాలతో నిజాలను బయట పెట్టినందుకే ప్రభుత్వం సమాధానం ఇవ్వకుండా, డైవర్షన్ టాక్టిక్స్‌లో భాగంగా నోటీసులు పంపిందని ఆరోపించారు.
“నిజాలకు సమాధానం ఇవ్వలేకనే ఈ విధంగా నోటీసులు పంపుతున్నారు. ఇది ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నమే” అని వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో మరోసారి దుమారం రేపుతుండగా, దీనిపై ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

