తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. “మేము భయపడే వాళ్లం కాదు, కొట్లాడతాం… కొట్లాడి మళ్లీ పునీతంగా బయటికి వస్తాం” అంటూ బీఆర్ఎస్ నేతలు స్పష్టమైన హెచ్చరికలు ఇస్తున్నారు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సింగరేణిలో టెండర్ల పేరుతో భారీ దందా ప్రారంభమైందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫిబ్రవరి 24 నుంచి ఈ అక్రమాలు మొదలయ్యాయని, ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్‌కు ఎంక్వైరీ డేట్ పెట్టారని తెలిపారు. ఆ సమయంలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ నిబంధన లేకపోవడంతో టెండర్ లెస్‌కు వెళ్లిందని పేర్కొన్నారు.
ఆ తర్వాత మే నెలలో మరో టెండర్ పిలిచినా అదే పరిస్థితి ఎదురైందని, గోదావరి, ఆర్జీ ఓసీపీ, ఓసీపీ మైన్ వంటి ప్రాజెక్టుల్లో అప్పటివరకు దందా మొదలు కాలేదని తెలిపారు. కానీ జూన్ 24 నుంచి అసలు కథ ప్రారంభమైందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది.
విక్రమ్ రెడ్డి అనే కాంట్రాక్టర్‌తో మొదలై, సృజన్ రెడ్డి, దీక్షిత్ రావు, జి. వెంకటేశ్వర్ రెడ్డి, సిఎల్సిహెచ్ సుశాంత్, సుధీర్, హీరాలాల్ ధోలు తదితరులు కలిసి ఒక రింగ్‌గా మారారని విమర్శించారు. ఇప్పటివరకు ఏడు టెండర్లు అన్నీ కూడా ‘ఎక్సెస్ బేసిస్’లో, అదే ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే నిబంధనను అడ్డుపెట్టుకుని నిర్వహించారని ఆరోపించారు.
ఒక్క టెండర్ రద్దు చేస్తే సరిపోదని, మిగతావన్నీ కూడా రద్దు చేస్తారా లేదా అని హరీష్ రావు ప్రశ్నించడంతో ప్రభుత్వం లిక్కి పడ్డదని విమర్శించారు. దాంతో రాజకీయ ప్రతీకారంగా హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారని ఆరోపణలు చేశారు.
రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చి, ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించడం చట్టాలకు, రాజ్యాంగానికి విరుద్ధమని బీఆర్ఎస్ పేర్కొంది. అయినా ఒక బాధ్యతగల పౌరుడిగా, నిబద్ధత కలిగిన నాయకుడిగా హరీష్ రావు తన సిద్దిపేట కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని విచారణకు హాజరయ్యారని తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇప్పటివరకు ఒక్క అధికారిక ప్రెస్ మీట్ కూడా ఎందుకు పెట్టలేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. లీకుల మీద లీకులు ఇస్తూ రాజకీయ వేదింపులకు పాల్పడుతున్నారని, సిట్ గానీ, మంత్రులు గానీ, ముఖ్యమంత్రి గానీ ప్రజల ముందుకు వచ్చి ఒక్క మాట కూడా చెప్పలేదని విమర్శించింది.
హరీష్ రావు అంటే ఎవరో కాంగ్రెస్ మంత్రులకు బాగా తెలుసని, అసెంబ్లీలోనే వారి అసమర్థతను బయటపెట్టిన నాయకుడని బీఆర్ఎస్ గుర్తు చేసింది. అలాంటి నాయకుడిని పోలీస్ అధికారులతో బెదిరిస్తే భయపడతామని అనుకోవడం మూర్ఖత్వమని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో పస లేదని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి కేసులతో ప్రజల దృష్టిని మళ్లించలేరని బీఆర్ఎస్ తేల్చి చెప్పింది.

