జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ మరియు బీజేపీ పార్టీలను కఠిన పదజాలంతో మందలించారు. ప్రజా సభలో మాట్లాడిన ఆయన, సెంటిమెంట్ కన్నా అభివృద్ధి ముఖ్యమని, జూబ్లీహిల్స్ ప్రజలు మళ్లీ తమ నిర్ణయాన్ని సరైన దిశగా చూపిస్తారని నమ్మకం వ్యక్తం చేశారు.
2014 నుంచి 2019 వరకు బీఆర్‌ఎస్ ఒక మహిళకు కూడా మంత్రివర్గంలో స్థానం ఇవ్వలేదని విమర్శించిన రేవంత్, “మహిళలు రాజ్యాన్ని నడపలేరా?” అని ప్రశ్నించారు. కుటుంబ ఆడబిడ్డపై జరిపిన అన్యాయాన్ని గుర్తుచేస్తూ, ఆమెను జైలుకు పంపినవారే, ఇప్పుడు కన్నీళ్లతో ప్రజలను మభ్యపెడుతున్నారు అని దుయ్యబట్టారు.
డ్రగ్స్, గంజాయి కేసులు పేదలపై మాత్రమే పెట్టి పెద్దల్ని విడిపిస్తున్న పరిస్థితిని ఖండిస్తూ, “పేదల కోసం పోరాడుతున్న నవీన్ యాదవ్‌ను రౌడీ అంటారా? నిజమైన రౌడీలు ఎవరో ప్రజలు బాగా తెలుసు” అని వ్యాఖ్యానించారు.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల పరిరక్షణపై దృష్టిసారించిన సీఎం, మహిళల ఉచిత బస్సు ప్రయాణం, రేషన్ కార్డులు, సన్నబియ్యం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వంటి పథకాలు నిరవధికంగా కొనసాగుతాయని హామీ ఇచ్చారు.
అమీర్పేటలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటు విషయాన్నీ ప్రస్తావిస్తూ, “తెలుగు సంస్కృతి, ఎన్టీఆర్‌ను గౌరవించడం మా బాధ్యతే. కానీ ఎన్నికల హడావుడిలో కాకుండా సరైన సమయంలో చేస్తాం” అని స్పష్టం చేశారు.
ఈ సభలో మంత్రులు తుమ్మాల నాగేశ్వరరావు, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, వాకిడి శ్రీహరి, మాజీ క్రికెటర్ అజారుద్దీన్, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ యాదవ్ పాల్గొన్నారు.
రేవంత్ రెడ్డి, నవీన్ యాదవ్ విజయం ద్వారా జూబ్లీహిల్స్ ప్రజల సమస్యలకు శాశ్వత పరిష్కారం వస్తుందని, అజారుద్దీన్‌ను మంత్రివర్గంలోకి తీసుకొని భాగస్వామ్యం పెంచుతామని హామీ ఇచ్చారు.
చివరిగా, “ప్రజల అభివృద్ధి, గౌరవం, భవిష్యత్ కోసం ఓటు వేయండి. సెంటిమెంట్లకు లొంగి తిరిగి పాత పరిస్థితులకెళ్లొద్దు” అంటూ ప్రజలను కోరారు.

