ఇటీవల తెలంగాణ రాజకీయాల్లో చర్చల దిశ పూర్తిగా మారిపోయిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పాలన, ప్రజల అవసరాలు, అభివృద్ధి అంశాలపై మాట్లాడాల్సిన నాయకులు కేవలం ప్రచారాల కోసమే వ్యాఖ్యలు చేస్తున్నారని ప్రజల్లో భావన బలపడుతోంది. ఒక సినిమా పాట ప్రచారంలో భాగంగా పాడామని చెప్పి కేసులు ఎదుర్కొన్న ఘటనల మాదిరిగానే, ఇప్పుడు రాజకీయ నాయకుల మాటలు కూడా కేవలం ఫ్రంట్ పేజీ వార్తల కోసమే అన్నట్టుగా కనిపిస్తున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
కేసీఆర్‌ను విమర్శించవద్దని ఎవరూ చెప్పడం లేదని, కానీ పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఏమీ జరగలేదన్న కారణంతోనే ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం ఇచ్చారని పలువురు గుర్తు చేస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు, మూడుేళ్లు గడుస్తున్నా ఇంకా అదే కేసీఆర్ పాలనను తిట్టడమే ప్రధాన అజెండాగా మారితే ప్రజల్లో విరక్తి పెరుగుతోందని అంటున్నారు. “అసలు ప్రభుత్వం ఎందుకు తెచ్చుకున్నాం, పాలన ఎక్కడ ఉంది?” అనే ప్రశ్నలు సాధారణ ప్రజల్లో వస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ముఖ్యమంత్రి మాట్లాడితే చిన్న నుంచి పెద్ద వరకు ప్రజలు ఆదర్శంగా చూడాల్సి ఉండాలని, విషయ పరిజ్ఞానం, హుందాతనం కనిపించాలన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ కొన్ని సందర్భాల్లో సీఎం ప్రసంగాలు పిల్లలు కూడా చూడకూడదని చెప్పే స్థాయికి పరిస్థితులు వెళ్లాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇది కేవలం రేవంత్ రెడ్డికే కాదు, మూడు ప్రధాన పార్టీల నాయకుల ప్రచార శైలిలోనూ ఇదే ధోరణి కనిపిస్తోందని అంటున్నారు.
ఒకరిని తిట్టితేనే పబ్లిసిటీ వస్తుందన్న రాజకీయ సంస్కృతి బలపడిందని, ప్రజల సమస్యలు, అభివృద్ధి అంశాలు పక్కన పడుతున్నాయని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, బండి సంజయ్ వంటి నేతలపై వ్యాఖ్యలే ప్రధాన వార్తలుగా మారుతున్నాయి తప్ప, విధానాలు, ప్రణాళికలు చర్చకు రావడం లేదని అంటున్నారు.
ఈ క్రమంలో కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం గుమ్లాపూర్‌లో నిర్వహించిన ప్రజాపాలన ప్రగతి బాట కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టును ఏటీఎంలా మార్చి వేల కోట్లు కొల్లగొట్టారంటూ కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు చేశారు. కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసుల్లో సీబీఐ విచారణ కోరినా కేంద్రం చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు ఫెవికాల్ బంధంలా కలిసి ఉన్నారని ఆరోపించారు.
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా, మెట్రో రైలు, మూసీ నిధులు, రీజినల్ రింగ్ రోడ్ వంటి అంశాల్లో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో వేల కోట్లు అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా దెబ్బతీశారని, ప్రజా ప్రభుత్వం ఇప్పుడు అప్పుల భారంతో పాలన సాగిస్తోందని సీఎం తెలిపారు.
మొత్తంగా చూస్తే, తెలంగాణ రాజకీయాలు పాలన కంటే ప్రచారాల చుట్టూనే తిరుగుతున్నాయన్న భావన ప్రజల్లో పెరుగుతోంది. విమర్శలు, ఆరోపణలు తగ్గించి అభివృద్ధి, ప్రజల అవసరాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.

