ఎమ్మెల్యేలతోనూ, మంత్రులతోనూ పని చేయించుకోలేని నాయకత్వంతో అభివృద్ధి సాధ్యం కాదని, అందుకే జగిత్యాల మున్సిపాలిటీ అభివృద్ధి బాధ్యతను కాంగ్రెస్ ప్రభుత్వం భుజాన వేసుకుందని కాంగ్రెస్ నేత స్పష్టం చేశారు. జగిత్యాలలో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, డాక్టర్ సంజయ్ సూచనల మేరకు పట్టణ ప్రధాన రహదారుల విస్తరణతో పాటు మౌలిక వసతుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు.
జగిత్యాల నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు వచ్చాయని, వాటిని తప్పకుండా అమలు చేస్తామని చెప్పారు. చొప్పదండిని అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని, యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ భవిష్యత్‌లో రాష్ట్ర స్థాయికి ఎదిగేలా చేస్తామని అన్నారు.
ఆలయాల అభివృద్ధి విషయంలో ప్రభుత్వం స్పష్టమైన ప్రణాళికతో ముందుకు వెళ్తోందని పేర్కొన్నారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి గతంలో రూ.150 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు చేపట్టామని గుర్తు చేశారు. శివుడిని దర్శించుకుంటే పదవి పోతుందన్న అపవాదులను తిప్పికొట్టుతూ, దేవాలయాల అభివృద్ధే ప్రజల అభివృద్ధి అని వ్యాఖ్యానించారు.
2027 గోదావరి పుష్కరాల దృష్ట్యా బాసర నుంచి భద్రాచలం వరకు గోదావరి తీరంలోని అన్ని ఆలయాలను అభివృద్ధి చేయడానికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని ప్రకటించారు. అవసరమైతే నాలుగు నుంచి ఐదు వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేసి ఆలయాలను పుణ్యక్షేత్రాలు, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతామని చెప్పారు. అటవీ ప్రాంతాల్లో ఎకో టూరిజం అభివృద్ధి కూడా చేపడతామని వెల్లడించారు.
సమ్మక్క–సారలమ్మ జాతరను ఉదాహరణగా చూపుతూ, తక్కువ సమయంలో కోట్లాది మంది భక్తులు దర్శించుకునేలా మౌలిక వసతులు కల్పించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనన్నారు. పేదలు కొలిచే దేవుళ్లను నిర్లక్ష్యం చేయకుండా, వారి అభివృద్ధిని ప్రభుత్వం బాధ్యతగా తీసుకుంటుందని స్పష్టం చేశారు.
బీఆర్‌ఎస్, బీజేపీలపై విమర్శలు గుప్పించిన ఆయన, కరీంనగర్ అభివృద్ధికి కేంద్రం నుంచి ఒక్క రూపాయి కూడా తెచ్చుకోలేని నాయకులు కేవలం మాటలకే పరిమితమయ్యారని ఆరోపించారు. నిజంగా ధైర్యం ఉంటే కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలని, అవినీతి ఆరోపణలపై చర్యలు తీసిపించాలని సవాల్ విసిరారు.
కరీంనగర్, వరంగల్ నగరాలకు ఔటర్ రింగ్ రోడ్‌లు, వరంగల్ ఎయిర్‌పోర్ట్ అభివృద్ధి, ఆధునిక డంపింగ్ యార్డ్ ఏర్పాటు ద్వారా విద్యుత్ ఉత్పత్తి వంటి భారీ ప్రణాళికలు అమలు చేస్తామని తెలిపారు. ఈ రెండు నగరాలను జంట నగరాలుగా అభివృద్ధి చేసి దేశానికి ఆదర్శంగా నిలిపే లక్ష్యం ఉందన్నారు.
తెలంగాణను దేశంలోనే నెంబర్‌వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, అత్యధిక ఉద్యోగాలు, అభివృద్ధి, సంక్షేమ పథకాలతో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బలమైన మద్దతు ఇస్తే మున్సిపాలిటీల అభివృద్ధి వేగంగా జరుగుతుందని పేర్కొన్నారు.

