రెండేళ్ల పాలన విజయాలపై అసెంబ్లీ చర్చా? సీఎం రేవంత్ ఆలోచనలపై విమర్శలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో, ప్రభుత్వ పాలనలో సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి, రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను చర్చించాలన్న ఆలోచనపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

అయితే ఈ ప్రతిపాదనపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు సంవత్సరాల పాలనలో ప్రభుత్వం సాధించిన “విజయాలు” ఏంటన్న ప్రశ్నలు ప్రజల్లో నుంచి వస్తున్నాయి. ఫుట్‌బాల్ ఈవెంట్లు నిర్వహించడం, కేబుల్ ఆపరేటర్లపై ఒత్తిళ్లు, రైతులకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పత్తి కొనుగోళ్లు జరగకపోవడం, వరి పంటలకు నష్టపరిహారం అందకపోవడం, వరదల బాధితులకు సహాయం లేకపోవడం వంటి అంశాలను విమర్శకులు ఎత్తిచూపుతున్నారు.

ఇంద్రమ్మ ఇళ్ల పంపిణీ విషయంలో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎవరికీ ఇళ్లు రాకపోవడం, ఇళ్ల నిర్మాణాల్లో అవకతవకలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అలాగే అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు, స్టాఫ్ నర్సులు, రిటైర్డ్ టీచర్లకు వేతనాలు, పెన్షన్లు అందకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా పేర్కొంటున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో “విజయాలపై అసెంబ్లీ సమావేశాలు” నిర్వహించాలన్న ఆలోచన ఎంతవరకు సమంజసమన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. సమస్యలపై చర్చించాల్సిన అవసరం ఉందని, విజయాల పేరుతో ప్రచారం చేయడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని విమర్శకులు అంటున్నారు.

మరోవైపు సర్పంచ్ ఎన్నికలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచే ఫాలోఅప్ చేసినట్లు తెలుస్తోంది. రెండో విడత ఫలితాలు, మూడో విడత పోలింగ్ ఏర్పాట్లపై కీలక నేతలతో ఆయన చర్చలు జరిపినట్టు సమాచారం. 3,752 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు తెలిపారు.

మొత్తానికి రెండేళ్ల పాలనపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఏం చెప్పబోతోందో, ప్రజలు ఆ వాదనలను ఎంతవరకు అంగీకరిస్తారో చూడాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *