సావిత్రిబాయి పూలే జయంతి వేదికగా పాలకులపై బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఫైర్.. 42% రిజర్వేషన్‌పై మౌనం ఎందుకు?

బీసీ పొలిటికల్ ఫ్రంట్ డిమాండ్

సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా తెలంగాణ బీసీ పొలిటికల్ ఫ్రంట్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం పాత్రికేయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బీసీ పొలిటికల్ ఫ్రంట్ వైస్ చైర్మన్ దుర్గేయ గౌడు, చైర్మన్ బాలగోని బాలరాజు గౌడ్, కన్వీనర్లు ఐలి వెంకన్న గౌడ్, వైర్ శేఖర్, అంబాల నారాయణ గౌడ్, బీసీ జనసైన్యం అధ్యక్షుడు నాగేశ్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. తొలి మహిళా ఉపాధ్యాయురాలిగా, మహిళా విద్యకు బాటలు వేసిన సంఘ సంస్కర్త సావిత్రిబాయి పూలే జయంతిని దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు. చదువుకు, సంస్కారానికి దూరంగా ఉన్న కాలంలో మహిళలకు విద్యే భవిష్యత్తు అని చాటిన మహాత్మ జ్యోతిబా పూలే, తన భార్య సావిత్రిబాయిని చదివించి ఆమె ద్వారా పేదలు, అనగారిన వర్గాలకు ఉచిత విద్యను అందించారని గుర్తు చేశారు.

అగ్రవర్ణాల ఆధిపత్యం, వివక్షత, వెట్టిచాకిరి కొనసాగుతున్న రోజుల్లో బ్రిటిష్ ప్రభుత్వ సహకారంతో పాఠశాలలు స్థాపించి మహిళలు, బాలికలకు విద్యను అందించారని తెలిపారు. సావిత్రిబాయి పూలే వేసిన విత్తనాలే నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలిచేందుకు కారణమయ్యాయని పేర్కొన్నారు.

అయితే, రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అధికారికంగా సావిత్రిబాయి పూలే జయంతిని నిర్వహించకపోవడం బాధాకరమని విమర్శించారు. మహనీయులను మాటల్లో పొగడటం తప్ప, వారి ఆశయాలను అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని ఆరోపించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఇప్పటికీ పార్లమెంట్‌లో పెండింగ్‌లో ఉండటం ప్రభుత్వాల ద్వంద్వ వైఖరికి నిదర్శనమని అన్నారు.

కేజీ నుంచి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని, కానీ విద్యను కార్పొరేట్లకు అప్పగిస్తూ పేదల నుంచి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యపై ఖర్చు పెట్టాల్సిన నిధులను ప్రాజెక్టుల పేరుతో దోచుకుంటున్నారని మండిపడ్డారు.

తెలంగాణలో సావిత్రిబాయి పూలే మహిళా యూనివర్సిటీని సెంట్రల్ యూనివర్సిటీగా ఏర్పాటు చేయాలని, 5వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పాఠ్యపుస్తకాల్లో సావిత్రిబాయి పూలే జీవితం పాఠ్యాంశంగా చేర్చాలని డిమాండ్ చేశారు. సామాజిక న్యాయంలో మహిళలకు అన్ని రంగాల్లో భాగస్వామ్యం కల్పించాలని, విద్యలో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ ప్రకటించాలని కోరారు.

ఇక బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్నా, అసెంబ్లీలో కనీసం చర్చ జరగకపోవడం దురదృష్టకరమని ఐలి వెంకన్న గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ పార్టీలన్నీ బీసీ అంశంపై మౌనం పాటిస్తున్నాయని ఆరోపించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను విస్మరిస్తోందని అన్నారు.

బీసీ జనగణనలో భారీ అవకతవకలు జరిగాయని, బీసీల శాతాన్ని తగ్గించి చూపించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను కాపాడుకునే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ప్రజా సమస్యలు, విద్య, ఉద్యోగాలు, ఆరోగ్యంపై అసెంబ్లీలో చర్చ జరగకుండా ఆధిపత్య రాజకీయాలే కొనసాగుతున్నాయని మండిపడ్డారు.

చివరగా బీసీ పొలిటికల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలను కలుపుకొని రాష్ట్రవ్యాప్తంగా గ్రామ గ్రామాన కమిటీలను ఏర్పాటు చేసి బలమైన రాజకీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మిస్తామని నేతలు ప్రకటించారు. మహిళలు, బహుజన వర్గాలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *