మేడారంలో చరిత్రాత్మక క్యాబినెట్ భేటీ: 18న మంత్రివర్గ సమావేశం, మున్సిపల్ ఎన్నికలపై కీలక నిర్ణయాలు?

తెలంగాణ చరిత్రలో తొలిసారిగా రాష్ట్ర మంత్రివర్గ సమావేశం హైదరాబాద్‌కు దూరంగా, ములుగు జిల్లా మేడారంలో నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 18న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమ్మక్క–సారలమ్మ మేడారం జాతర ప్రాంతంలో క్యాబినెట్ భేటీ జరగనుంది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

ఈ క్యాబినెట్ సమావేశంలో ముఖ్యంగా మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి డెడికేటెడ్ కమిషన్ నివేదికకు ప్రభుత్వ ఆమోదం తెలిపే అవకాశం ఉందని సమాచారం. అలాగే రైతు భరోసా వంటి కీలక అంశాలపై కూడా స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రులు, కీలక ఐఏఎస్ అధికారులు పెద్ద సంఖ్యలో మేడారానికి చేరుకోనున్నారు.

ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదిలాబాద్ జిల్లా ఉట్నూర్‌లో మంత్రివర్గ సమావేశం నిర్వహించగా, ఇప్పుడు మళ్లీ అలాంటి చరిత్రాత్మక ఘట్టానికి మేడారం వేదిక కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. సమ్మక్క–సారలమ్మ జాతర ప్రాంతంలో క్యాబినెట్ సమావేశం జరగడం రాజకీయంగా, పరిపాలనాపరంగా కీలకంగా భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *