రాబోయే తరానికి కాలుష్య రహిత భవిష్యత్తును అందించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం జీవో నంబర్ 41 ద్వారా ఈవీ (ఎలక్ట్రిక్ వాహన) పాలసీని తీసుకొచ్చిందని అసెంబ్లీలో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ పాలసీ అమలులోకి వచ్చిన తర్వాత కేవలం ఒక్క సంవత్సరంలోనే లక్షకు పైగా ఈవీ వాహనాలు అమ్ముడైనట్లు సభకు తెలియజేశారు.
ఈవీ వాహనాల కొనుగోలుపై 100 శాతం రిజిస్ట్రేషన్ ఫీజు, రోడ్ టాక్స్ మినహాయింపులు ఇచ్చినట్లు తెలిపారు. ఈ నిర్ణయంతో రాష్ట్రానికి సుమారు రూ.900 కోట్ల మేర ఆదాయ నష్టం వచ్చినప్పటికీ, పర్యావరణ పరిరక్షణ కోసమే ఈ పాలసీని కొనసాగిస్తున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది. తెలంగాణను చూసి ఇతర రాష్ట్రాలు కూడా ఇలాంటి ఈవీ పాలసీలు అమలు చేస్తున్నాయన్నారు.
గతంలో 150 కిలోమీటర్ల రేంజ్ ఉన్న బ్యాటరీ సామర్థ్యం ప్రస్తుతం 500 కిలోమీటర్ల వరకు పెరిగిందని, భవిష్యత్తులో మరింత మెరుగుదల కోసం సమీక్షలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఆర్టీసీతో పాటు ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, గేటెడ్ కమ్యూనిటీల్లో చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు.
ఇటీవల ఈవీ తయారీదారులు, డీలర్లతో సమావేశం నిర్వహించామని, ప్రభుత్వ ఉద్యోగులు ఈవీ వాహనాలు కొనుగోలు చేస్తే 20 శాతం వరకు ప్రత్యేక డిస్కౌంట్ ఇవ్వాలని కంపెనీలను కోరినట్లు తెలిపారు. దీంతో ఈవీ సేల్స్ 33 శాతం నుంచి దాదాపు 42 శాతం వరకు పెరిగినట్లు పేర్కొన్నారు.
కాలుష్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వ కొనుగోళ్లలో 25 నుంచి 50 శాతం వరకు ఈవీ వాహనాలే తీసుకునేలా విధానం రూపొందిస్తున్నామని తెలిపారు. ఢిల్లీ తరహా తీవ్రమైన ఎయిర్ క్వాలిటీ పరిస్థితులు తెలంగాణకు రాకుండా ముందస్తు చర్యలు అవసరమని చెప్పారు.
ఆర్టీసీ పరంగా ఇప్పటికే పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద 575 ఈవీ బస్సులు నడుస్తుండగా, మరో 2,800 బస్సులు త్వరలో రానున్నాయని వెల్లడించారు. వరంగల్‌కు 100, నిజామాబాద్‌కు 50 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్ర ప్రభుత్వ స్కీమ్ ద్వారా కేటాయించనున్నట్లు తెలిపారు.
15 సంవత్సరాలు దాటిన వాహనాల కోసం స్క్రాప్ పాలసీని అమలు చేస్తున్నామని, పాత వాహనాలను స్క్రాప్ చేస్తే ఇన్సెంటివ్ ఇచ్చే విధానాన్ని తీసుకొచ్చామని చెప్పారు. ఆటోలు, బస్సుల్లో రెట్రోఫిట్ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు.
హైదరాబాద్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 200కు చేరుతున్న సందర్భాలు ఉన్నాయని, దీనిని తగ్గించేందుకు ఈవీ, ఎల్పీజీ, సిఎన్జీ వాహనాల వైపు ప్రజలు మారాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ప్రజలు, అధికార వ్యవస్థ, ప్రజాప్రతినిధులు కలిసి పనిచేస్తేనే కాలుష్య రహిత తెలంగాణ సాధ్యమవుతుందని పేర్కొన్నారు.
మొత్తంగా ఈవీ పాలసీ ద్వారా దేశంలోనే తెలంగాణను రోల్ మోడల్‌గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందని అసెంబ్లీలో స్పష్టం చేసింది.

