ఫిబ్రవరిలో మున్సిపల్ ఎన్నికలు: క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్
మేడారంలో చారిత్రకంగా 27వ మంత్రివర్గ భేటీ – కీలక నిర్ణయాలు వెల్లడి
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర మంత్రివర్గం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదివారం ములుగు జిల్లా మేడారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన 27వ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ నిర్ణయాలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సహచర మంత్రులు కోమటరెడ్డి వెంకట్ రెడ్డి, దాసరి సీతక్కలతో కలిసి మీడియాకు వివరించారు.
ఫిబ్రవరిలోనే మున్సిపల్ ఎన్నికలు
రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లు, మొత్తం 2996 వార్డు సభ్యుల పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో వీలైనంత త్వరగా ఎన్నికలు నిర్వహించాలని క్యాబినెట్ నిర్ణయించింది. డెడికేషన్ కమిషన్ ఇప్పటికే నివేదిక ఇచ్చిందని, దాని ఆధారంగా రెండు రోజుల క్రితమే రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు మంత్రి తెలిపారు.
ఫిబ్రవరి 15న శివరాత్రి, ఆ తర్వాత రంజాన్ పండుగ, అలాగే విద్యార్థుల పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఫిబ్రవరి 15కు ముందే ఎన్నికలు నిర్వహించే అవకాశముంది అనే చర్చ మొదలైంది. ఈ నెల 22 నుంచి 25 మధ్య ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం.
రాజకీయ జాగ్రత్తలు – సీఎం ఆదేశాలు
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ ఇచ్చే స్థితిలో లేదన్న అంచనాలు ఉన్నప్పటికీ, గెలుపు ఈజీ అనుకుని నిర్లక్ష్యం చేయవద్దని సీఎం మంత్రులకు స్పష్టమైన సూచనలు చేసినట్లు తెలిసింది. కీలక సమయంలో విదేశీ పర్యటనలు, అనవసర నిర్ణయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఆదేశించినట్లు సమాచారం.
2027 గోదావరి పుష్కరాలకు ఇప్పటినుంచే ఏర్పాట్లు
2027 జులై 27 నుంచి ఆగస్టు 3 వరకు జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ఇప్పటినుంచే ప్రణాళికలు అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. బాసర్ నుంచి భద్రాచలం వరకు టెంపుల్ సర్క్యూట్ అభివృద్ధికి కన్సల్టెన్సీలను కరారు చేశారు. ఫిబ్రవరి 15లోగా నివేదిక వచ్చిన తర్వాత మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటు చేసి పనులు ప్రారంభించనున్నారు.
దేవాదాయ, రెవెన్యూ, అటవీ, పురావస్తు శాఖలు సంయుక్తంగా సమగ్ర నివేదిక సిద్ధం చేయాలని నిర్ణయించారు
మేడారం అభివృద్ధి – తిరుపతి స్థాయికి?
కుంభమేళాను తలపించే మేడారం జాతరకు మరింత సౌకర్యాలు కల్పించేందుకు మేడారం దేవాలయం అభివృద్ధికి 19 ఎకరాలు కేటాయించగా, మరో 21 ఎకరాలు సేకరించనున్నట్లు మంత్రి పొంగులేటి తెలిపారు. భవిష్యత్తులో మేడారాన్ని తిరుపతి స్థాయిలో అభివృద్ధి చేస్తామని వెల్లడించారు.
మౌలిక సదుపాయాలకు ఊతం
- మెట్రో రెండో దశ భూసేకరణకు గ్రీన్ సిగ్నల్
- 2787 కోట్లతో కీలక మౌలిక వసతుల అభివృద్ధి
- పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ నుంచి శిల్ప లేఔవుట్ వరకు హై లెవెల్ బ్రిడ్జ్
- రాబోయే రెండేళ్లలో రాష్ట్రంలో మట్టి రోడ్లు కనిపించకుండా 6000 కి.మీ హామీ రోడ్ల పనులు
విద్యా రంగానికి శుభవార్త
నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో:
- లా కాలేజీలో 24 కొత్త పోస్టులు
- ఫార్మసీ కాలేజీలో 28 పోస్టులు
- వీరనారి చాకలి ఐలమ్మ మహిళా యూనివర్సిటీలో రిజిస్ట్రార్ పోస్టుకు ఆమోదం
ములుగు జిల్లాకు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్
మంత్రి సీతక్క వెల్లడించిన ప్రకారం, ములుగు జిల్లాలో పొట్లాపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
- రామప్ప చెరువు నుంచి నీటిని లిఫ్ట్ చేసి
- 5 గ్రామాలు, 30 చెరువులు, కుంటలు నింపడం
- 7500 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు
- రూ.143 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మాణం

