టెండర్ రింగ్ ముఠా, ఫోన్ ట్యాపింగ్ లీకులు: కాంగ్రెస్ పాలనలో బయటపడుతున్న దోపిడీ రాజకీయాలు

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దోపిడీ రాజకీయాలు మొదలయ్యాయని బీఆర్ఎస్ తీవ్ర ఆరోపణలు చేస్తోంది. ముఖ్యంగా సింగరేణి సంస్థలో టెండర్ల పేరుతో జరిగిన అక్రమాలపై తాజాగా సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి.

ఫిబ్రవరి 2024 నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాకే ఈ దందా ప్రారంభమైందని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఫిబ్రవరి 20న 385 కోట్ల విలువైన టెండర్‌కు ఎంక్వైరీ డేట్ పెట్టగా, ఆ సమయంలో ‘సైట్ విజిట్ సర్టిఫికెట్’ అనే నిబంధన లేకపోవడంతో టెండర్ లెస్‌కు వెళ్లిందని తెలిపారు. ఆ తర్వాత మే నెలలో మరో టెండర్ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొందని పేర్కొన్నారు.

జూన్ 24 నుంచి అసలు కథ మొదలైందని ఆరోపణలు ఉన్నాయి. విక్రమ్ రెడ్డి, సృజన్ రెడ్డి, దీక్షిత్ రావు, జి. వెంకటేశ్వర్ రెడ్డి, సిఎల్‌సిహెచ్ సుశాంత్, సుధీర్, హీరాలాల్ ధోలు తదితరులు కలిసి ఒక రింగ్‌లా మారి టెండర్లను మేనేజ్ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. ‘సైట్ విజిట్ సర్టిఫికేషన్’ అనే నిబంధనను అడ్డుపెట్టుకుని కాంట్రాక్టర్లను బెదిరించి, అనుకూలంగా ఉన్నవారికే టెండర్లు కట్టబెట్టారని విమర్శలు చేశారు.

సృజన్ రెడ్డి బెదిరింపులకు లొంగని కాంట్రాక్టర్లను పక్కన పెట్టి, గతంలో మైనస్ 10 నుంచి 22 శాతం వరకు వెళ్లిన టెండర్లను డైరెక్ట్‌గా సృజన్ రెడ్డి కంపెనీకి అప్పగించారని, 207 కోట్ల విలువైన కాంట్రాక్టు కేవలం 12 శాతానికే ఇచ్చారని ఆరోపించారు. ‘శోధా కన్స్ట్రక్షన్స్’ అనే సంస్థ సృజన్ రెడ్డి భార్య పేరుతో ఉందని, ఇది నిజమో కాదో మీడియానే పరిశీలించాలని సవాల్ విసిరారు.

ఈ మొత్తం రింగ్ టెండర్ల వెనుక సృజన్ రెడ్డి ఉండగా, ఆయనకు రేవంత్ రెడ్డి బావమరిది కావడం గమనార్హమని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. నిన్న మాజీ మంత్రి హరీష్ రావు ఈ వ్యవహారాన్ని బయటపెట్టిన వెంటనే ప్రభుత్వం ఉలిక్కిపడిందని ఆరోపించారు. ఒక్క టెండర్ రద్దు చేస్తే సరిపోదని, మిగతావి కూడా రద్దు చేస్తారా అని హరీష్ రావు ప్రశ్నించడంతో కాంగ్రెస్ ప్రభుత్వం భయపడిందని తెలిపారు.

దాంతోనే రాజకీయ ప్రతీకారంగా హరీష్ రావుకు నోటీసులు జారీ చేశారని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. రాత్రి 9 గంటలకు నోటీసు ఇచ్చి, ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని ఆదేశించడం చట్టాలు, రాజ్యాంగానికి విరుద్ధమని విమర్శించారు. అయినా ఒక బాధ్యతగల నాయకుడిగా హరీష్ రావు తన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకుని హుటాహుటిన హైదరాబాద్ చేరుకొని విచారణకు హాజరయ్యారని పేర్కొన్నారు.

ఫోన్ ట్యాపింగ్ కేసుపై ఇప్పటి వరకు ప్రభుత్వం ఒక్క అధికారిక ప్రెస్ మీట్ కూడా పెట్టలేదని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. లీకుల మీద లీకులు ఇస్తూ రాజకీయ వేదింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. సిట్, మంత్రులు, ముఖ్యమంత్రి ఎవ్వరూ అధికారికంగా ప్రజల ముందుకు వచ్చి వివరాలు చెప్పకపోవడం అనుమానాలకు తావిస్తోందని వ్యాఖ్యానించారు.

హరీష్ రావు అంటే ఎవరో కాంగ్రెస్ మంత్రులకు బాగా తెలుసని, అసెంబ్లీలోనే వారి అసమర్థతను బయటపెట్టిన నాయకుడని బీఆర్ఎస్ నేతలు గుర్తు చేశారు. అలాంటి నాయకుడిని పోలీస్ అధికారులతో బెదిరిస్తే భయపడతామని అనుకోవడం మూర్ఖత్వమని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు కూడా ఫోన్ ట్యాపింగ్ కేసులో పస లేదని వ్యాఖ్యానించిన విషయాన్ని గుర్తు చేస్తూ, ఇలాంటి కేసులతో ప్రజల దృష్టిని మళ్లించలేరని బీఆర్ఎస్ తేల్చి చెప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *