తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TGDMA) తరపున అధ్యక్షులు ఉప్పాల రజినీకాంత్ గారి ఆధ్వర్యంలో, బక్కా జెసన్ గారి నేతృత్వంలో, రాష్ట్రంలోని పలువురు డిజిటల్ మీడియా ప్రతినిధులు కలిసి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ)కు ఫిర్యాదు చేశారు. మల్లన్నకు సంబంధించిన అరెస్టులు, అనంతర పరిణామాలు, అలాగే మీడియా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులపై ఈ ఫిర్యాదు దాఖలు చేసినట్లు వారు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో మల్లన్న అరెస్టు అయిన రోజునే తాము ప్రశ్నించామని, అప్పట్లో ప్రశ్నించే గొంతులు లేకపోతే ఇప్పటికీ ఆయన జైలులోనే ఉండేవాడని టీజీడీఎంఏ నేతలు వ్యాఖ్యానించారు. ప్రశ్నించడం జర్నలిజం ధర్మమని, అయితే ప్రశ్నించిన ప్రతిసారి కేసులు, బెదిరింపులు ఎదురవుతున్నాయని వారు ఆరోపించారు.
మల్లన్న తనపై వచ్చిన ఆరోపణలకు సమాధానం చెప్పకుండా, ప్రతిసారి బీసీ నినాదాన్ని రాజకీయ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని, నిరుద్యోగ సమస్యలపై మాట్లాడతానని చెప్పి ఎమ్ఎల్సీ అయిన తర్వాత ఆ అంశాన్ని పక్కన పెట్టారని విమర్శించారు. సాయిచారి మరణాన్ని రాజకీయంగా ఉపయోగించుకునే ప్రయత్నం జరుగుతోందని, దానిపై అనేక అనుమానాలు ఉన్నాయని పేర్కొన్నారు.
డిజిటల్ మీడియా ఛానళ్లపై తప్పుడు రిపోర్టులు కొట్టించడం, కాస్ట్ డిస్క్రిమినేషన్ ఆరోపణలు తెరపైకి తీసుకొచ్చి బెదిరించడం, ఛానళ్లను మూసేస్తామని హెచ్చరించడం వంటి చర్యలను వారు తీవ్రంగా ఖండించారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అయినా, ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయినా తమ ప్రశ్నలను ఎదుర్కొన్నాయని, అయితే నిజమైన జర్నలిస్టుల గొంతు నొక్కలేకపోయాయని అన్నారు.
క్యూ న్యూస్ కార్యాలయంలో సాయిచారి ఘటనకు సంబంధించి సీసీటీవీ ఫుటేజ్, భవనం చుట్టూ ఉన్న విజువల్స్ ఇప్పటివరకు ఎందుకు విడుదల చేయలేదని వారు ప్రశ్నించారు. పోలీసులు, క్యూ న్యూస్ యాజమాన్యం ఈ అంశంలో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రజల ముందు ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము ఉంటే చెప్పాలని, లేకపోతే రాజకీయాలు, మీడియా పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం మానుకోవాలని టీజీడీఎంఏ నేతలు స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రజలు, ముఖ్యంగా బీసీలు కూడా ఇక నమ్మడం లేదని, సోషల్ మీడియాలో వచ్చే కామెంట్లే దీనికి నిదర్శనమని వారు పేర్కొన్నారు.
మీడియా స్వేచ్ఛ, మానవ హక్కుల పరిరక్షణ కోసమే ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశామని, న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని టీజీడీఎంఏ నేతలు తెలిపారు.

