కేంద్ర బడ్జెట్ 2026పై భారీ అంచనాలు: రాయితీలు ధనవంతులకా… సామాన్యులకా?

రేపు పార్లమెంట్లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ 9వ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. అంతర్జాతీయ ఆర్థిక అస్థిరతలు ఒకవైపు, దేశీయంగా పెరుగుతున్న ధరలు, నిరుద్యోగం, ఎంఎస్ఎంఈలపై ఒత్తిడి మరోవైపు ఉన్న ఈ సమయంలో వచ్చే బడ్జెట్‌పై సామాన్యుల నుంచి వ్యాపార వర్గాల వరకు భారీ అంచనాలు నెలకొన్నాయి.

గత బడ్జెట్‌లో ఆదాయపన్ను ఉపశమనాలతో మధ్య తరగతి కొంత ఊరట పొందింది. ఈసారి పెద్ద సంస్కరణలు కాకపోయినా, స్టాండర్డ్ డిడక్షన్‌ను కొత్త పన్ను విధానంలో ₹75,000 నుంచి ₹1 లక్షకు పెంచాలని టాక్స్ పేయర్స్ కోరుతున్నారు. రోజువారీ ఖర్చులు, జీవన వ్యయం విపరీతంగా పెరిగిన నేపథ్యంలో ప్రస్తుత డిడక్షన్ సరిపోవడం లేదని వారి అభిప్రాయం.

అలాగే హెల్త్ ఇన్సూరెన్స్‌పై అదనపు పన్ను రాయితీలు, వృద్ధుల సంక్షేమం, దిగువ-మధ్య తరగతి ప్రజలకు గృహ నిర్మాణం కోసం సులభమైన హౌసింగ్ లోన్లు వంటి అంశాలపై కూడా ఆశలు ఉన్నాయి. గ్రామీణ వినియోగం పెరిగేలా బడ్జెట్‌లో చర్యలు తీసుకుంటే వ్యవసాయం, ఎంఎస్ఎంఈలకు ఊతం లభిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.

వ్యాపార వర్గాలు, స్టార్టప్స్, పెట్టుబడిదారులు సులభమైన పన్ను నిబంధనలు, జీఎస్టీ సరళీకరణలు, దీర్ఘకాలిక మూలధన లాభాలపై స్పష్టత, కస్టమ్స్ సుంకాల్లో మార్పులు, మేక్ ఇన్ ఇండియాకు మరింత ప్రోత్సాహం ఉంటుందని ఆశిస్తున్నారు.

కానీ అసలు ప్రశ్న ఒక్కటే — బడ్జెట్ రాయితీలు నిజంగా ఎవరికీ అందుతున్నాయి? గత బడ్జెట్‌లో కార్లపై జీఎస్టీ తగ్గింపు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ నిత్యావసర వస్తువులపై జీఎస్టీ తగ్గినట్లు సామాన్యుడికి అనుభవం కనిపించలేదు. కార్లు కొనేది ప్రధానంగా ధనవంతులే కావడంతో, ఇలాంటి రాయితీలు మధ్యతరగతి లేదా బిలో మిడిల్ క్లాస్‌కు ఎంతవరకు ఉపయోగపడతాయన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

నిజంగా రాయితీలు అందాల్సింది రోజువారీ ఖర్చులతో ఇబ్బంది పడుతున్న సామాన్యులకు. ₹30,000–₹40,000 జీతంతో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు నిత్యావసర వస్తువుల ధరలే పెద్ద భారం అవుతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో విలాస వస్తువులపై కాకుండా, అవసరమైన వస్తువులపై పన్ను భారం తగ్గించాలని ప్రజలు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *