ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మరో విషాదకర ప్రమాదం చోటుచేసుకుంది. గ్రేటర్ నోయిడాలోని దాద్రి ప్రాంతంలో ఓ యువకుడు రైల్వే ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనకు సంబంధించిన భయానక వీడియో సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతోంది.
వివరాల్లోకి వెళ్తే, తుషార్ అనే యువకుడు తన బైక్‌పై రైల్వే ట్రాక్ దాటేందుకు ప్రయత్నించాడు. ఆ సమయంలో క్రాసింగ్ గేట్ మూసివేసి ఉన్నప్పటికీ అతను అజాగ్రత్తగా దానిని దాటేందుకు ప్రయత్నించాడు. బైక్ ట్రాక్ మీద జారిపడి పడిపోయింది. దాన్ని తీయడానికి ప్రయత్నిస్తుండగా రైలు దగ్గరికి రావడాన్ని గమనించి పరిగెత్తడం ప్రారంభించాడు. కానీ, భయంతో రైల్వే ట్రాక్ పక్కకు కాకుండా ట్రాక్ మీదే పరిగెత్తడంతో రైలు అతడిని ఢీకొట్టింది. తుషార్ అక్కడికక్కడే మరణించాడు.
ఈ వీడియో చూసిన నెటిజన్లు షాక్‌కు గురవుతున్నారు. “ప్రాణం క్షణాల్లో పోతుంది – జాగ్రత్తగా ఉండాలి” అంటూ సోషల్ మీడియాలో హెచ్చరికలు చేస్తున్నారు. భద్రతా నిబంధనలను పాటించకుండా రైల్వే ట్రాక్ దాటే వారిపై ఆందోళన వ్యక్తమవుతోంది.
తాజాగా విడుదలైన జాతీయ నేర రికార్డుల బ్యూరో (NCRB) నివేదిక ప్రకారం, 2023లో దేశవ్యాప్తంగా నమోదైన 2,483 రైల్వే ప్రమాదాల్లో 1,025 కేసులు ఉత్తరప్రదేశ్‌లోనే చోటుచేసుకున్నాయి. అలాగే, ఆ ప్రమాదాల్లో 1,007 మరణాలు కూడా ఉత్తరప్రదేశ్‌లోనే సంభవించాయి. ఇది రైల్వే భద్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
భద్రతా నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అధికారులు మరోసారి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

