దేశ ప్రధాని నరేంద్రమోదీ ఆదివారం ప్రసారమైన “మన్ కీ బాత్” కార్యక్రమంలో తెలంగాణ యోధుడు కొమరం భీంను ప్రస్తావించడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మోదీ మాట్లాడుతూ — “20వ శతాబ్దం ప్రారంభంలో, బ్రిటిష్ వారి దోపిడి నుండి ప్రజలను కాపాడేందుకు ఒక యువ యోధుడు, కొమరం భీం, కేవలం 20 ఏళ్ల వయసులోనే ఉద్యమించాడు” అని పేర్కొన్నారు. ఆయన తెలంగాణ గిరిజనుల స్వాభిమాన పోరాటాన్ని గుర్తుచేసి, యువత ఆయనను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.
ప్రధాని మాటలతో తెలంగాణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. “మన్ కీ బాత్‌లో అయినా మా తెలంగాణని గుర్తు చేసుకున్నారు, కొమరం భీం గురించి మాట్లాడారు — చాలా గర్వంగా ఉంది” అని నెటిజన్లు స్పందిస్తున్నారు.
కొమరం భీం చరిత్రను ప్రజలకు చేరవేసిన దర్శకుడు అల్లాని శ్రీధర్ గురించి కూడా పలువురు గుర్తుచేసుకున్నారు. ఆయన తెరకెక్కించిన “తెలంగాణ యోధుడు” చిత్రం ద్వారా కొమరం భీం చరిత్ర వెలుగులోకి వచ్చింది. ఆ సినిమా అనేక అడ్డంకులు ఎదుర్కొని చివరికి విడుదలై, తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది.
అలాగే “పరమవీర చక్ర” సినిమాలో కూడా కొమరం భీం పాత్రను చూపించారు. ఆయన గిరిజన రైతుల హక్కుల కోసం పోరాడి, తమ భూములను రక్షించేందుకు తన ప్రాణాలను అర్పించారు.
ప్రధాని మోదీ గారు ఈ ప్రస్తావన ద్వారా తెలంగాణ చరిత్రపై తన అవగాహనను చూపించారు. సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఆయన ప్రసంగాన్ని ప్రశంసిస్తూ, “దేశ నాయకుడు మా తెలంగాణ యోధుడిని గుర్తు చేసుకోవడం గర్వకారణం” అని అభిప్రాయపడ్డారు.

