తెలంగాణ రాష్ట్రంలోని షామీర్పేట పెద్దమ్మ కాలనీలో నివసిస్తున్న పేద ప్రజలు తమ దయనీయ పరిస్థితులను కన్నీళ్లతో వ్యక్తం చేశారు. ఆహారం, ఇల్లు, విద్య, నీరు, కరెంట్ ఏదీ సక్రమంగా అందడంలేదని వారు తీవ్రంగా ఆవేదన చెందుతున్నారు.
ఒక మహిళ మాట్లాడుతూ –
“మాకు ఇల్లు లేదు మేడం. నెలకు ₹4000 కిరాయి కడతాం. పిల్లల్ని చదివించడానికి గతి లేదు. గవర్నమెంట్ స్కూల్‌లో రెండు బుక్స్ ఇస్తారు, కానీ తినడానికి కూడా లేదు. నా భర్త చనిపోయి ఆరు సంవత్సరాలు అయ్యింది. ఒంటరి మహిళా పించన్ 2000 రూపాయలు మాత్రమే వస్తుంది. రేవంత్ ప్రభుత్వం ఇచ్చిందేమీ లేదు” అని కన్నీళ్లు పెట్టుకున్నారు.
మరో మహిళ మాట్లాడుతూ –
“మా పెద్దమ్మ కాలనీలో నీళ్లు లేవు, కరెంట్ లేదు. రోజుకు 20 నిమిషాలే నీళ్లు ఇస్తారు. పిల్లలు చీకట్లో పాములతో భయపడి ఏడుస్తున్నారు. డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇస్తామంటారు కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఉన్నవాళ్లకే రెండో సారి ఇస్తున్నారు. లేని వాళ్లకి మాత్రం ఏమీ రావట్లేదు” అని వాపోయారు.
ప్రజలు కలెక్టర్, ఎమ్మెల్యే రంజిత్ రెడ్డి, సీఎం రేవంత్ రెడ్డికి విజ్ఞప్తి చేస్తూ —
“మాకు కూడా పైప్‌లైన్ వేయండి. మేము కూడా మనుషులమే కదా. నీళ్లు లేక మేము ఎలా బతకాలి? పాములు తిరుగుతున్నాయి, కరెంట్ లేదు, పిల్లలకి చదువు లేదు. మాకు ఇళ్లు, నీళ్లు, కరెంట్ ఇవ్వండి. మా బాధలు చూడండి” అని వేడుకుంటున్నారు.
గురుకుల పాఠశాలల్లో పనిచేసే సిబ్బంది కూడా తమ జీతాలు ఆరు నెలలుగా రాకపోవడంతో ఆర్థికంగా కష్టాలు పడుతున్నారు.
“మేము వాచ్మెన్, సోషల్ హెల్పర్లు. ఆరు నెలలుగా జీతం లేదు. ఒకరు ఆర్థిక కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకున్నారు. ఇంత దారుణం ఎందుకు జరుగుతోంది?” అని వారు ప్రశ్నించారు.
స్థానికులు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ఉద్దేశించి,
“ఓట్లు అడిగేటప్పుడు వస్తారు. గెలిచాక ఐదు సంవత్సరాలు ముఖం కూడా చూపరేరు. పేదల పట్ల కనికరముండాలి. ఇళ్లు లేనివారికి ఇల్లు ఇవ్వండి, నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి. సంక్షేమ పథకాలు పేపర్‌లో కాకుండా ప్రజల జీవితాల్లో కనిపించాలి” అని కోరుతున్నారు.
ముసలమ్మలు, ఒంటరి మహిళలు, కూలీలు, కార్మికులు – అందరూ ఒకే మాట చెబుతున్నారు:
“మాకు ఇళ్లు ఇవ్వండి మేడం, నీళ్లు ఇవ్వండి, కరెంట్ ఇవ్వండి. మేము బతకడానికి ప్రభుత్వం సాయం చేయాలి. ఆరు గ్యారెంటీలు అన్నీ మాటల్లోనే ఉన్నాయి.”

