జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రాజకీయ వేడి రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా లోకల్ Vs నాన్-లోకల్ అభ్యర్థి వాదనతో ప్రచారం రగులుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ నాయకులు, స్థానిక కార్యకర్తలు తమ అభిప్రాయాలను గట్టిగా వెలిబుచ్చుతున్నారు.
బీఆర్ఎస్ అనుచరులు మాట్లాడుతూ, ప్రజల్లో ఇంకా పార్టీపై విశ్వాసం ఉందని, కేసీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలే తమ బలం అని చెబుతున్నారు. “ప్రజలు జెండా కాదు అభ్యర్థి పనిని చూస్తారు, అభివృద్ధి చూసి ఓటేస్తారు” అంటూ వారు అభిప్రాయపడ్డారు.
మరోవైపు కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రచారంలో పాల్గొన్న నేత ఒకరు మాట్లాడుతూ,
“ఒక్క గ్యారెంటీ కూడా సరిగా అమలు కాలేదు; బస్ ఫ్రీ స్కీం వల్ల కుటుంబాల్లో గొడవలు వచ్చాయి, కరెంట్ ఫ్రీ, గ్యాస్ సబ్సిడీ, బంగారం పథకాలు అన్నీ మాటలే అయ్యాయి” అని ఆరోపించారు.
కాంగ్రెస్ నేత నవీన్ యాదవ్కు స్థానిక అనుభవం ఉన్నప్పటికీ, బీఆర్ఎస్ ప్రాతినిధ్యం చేసిన మాగంటి సునీతకు ప్రజా మద్దతు ఎక్కువగా ఉందని బీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నారు. అయితే గత ఎన్నికల్లో మంచి ఓట్లు సాధించిన నవీన్ ఈసారి సవాలు ఎదుర్కొంటారని అంటున్నారు.
మరో కీలక అంశం ఓటర్ లిస్ట్ పై ఆరోపణలు.
కొంతమంది స్థానికులు డబుల్ ఎంట్రీలు, అన్యాయం జరిగే అవకాశాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. “ప్రతి బ్లాక్లో డబుల్ ఎంట్రీలు ఉన్నాయి, సెక్షన్ వారీగా తప్పులు కనిపిస్తున్నాయి” అంటూ వారు ఎన్నికల అధికారుల దృష్టిని ఆకర్షించారు.
ఉపఎన్నిక దగ్గరపడుతున్న కొద్దీ వాదోపవాదాలు ముదురుతున్నాయి. అసలు ప్రజాభిప్రాయం ఏ దిశలో ఉందో… ఎన్నికల ఫలితాలు వెల్లడించే వరకు ఉత్కంఠ కొనసాగనుంది.

