తెలంగాణ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, మాజీ ప్రధాని స్వర్గీయ ఇందిరా గాంధీ గారి జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా కోటిమంది మహిళలకు ‘ఇంద్రమ్మ చీరలు’ పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఇందిరమ్మ చీరల పంపిణీపై మంత్రి అనసూయ ధనసరి సీతక్కతో పాటు ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. అర్హులైన ప్రతి మహిళకు నాణ్యమైన ఇంద్రమ్మ చీర అందేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖలను ఆదేశించారు.
అయితే ఈ పథకం పై రాజకీయ విమర్శలు గట్టెక్కాయి. మహిళల సమస్యల పరిష్కారానికి చీరలు ఇవ్వడం కన్నా, స్వయం ఉపాధిని పెంపొందించే చిన్నపాటి పరిశ్రమలు, సబ్సిడీలు, శిక్షణలు అందించాల్సిన సమయం ఇప్పుడు అని విమర్శకులు పేర్కొంటున్నారు. మహిళల్లో ధైర్యం, ఆర్థిక స్థిరత్వం పెంచే విధానాలకు ప్రాధాన్యత ఇవ్వకుండానే ఎన్నికల ముందు చీరల పంపిణీ రాజకీయ లక్ష్యాలతో చేసుకుంటున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
చీరల నాణ్యతపైన కూడా బహిరంగ వేదికలపై విమర్శలు ఉద్భవిస్తున్నాయి. గతంలో పంపిన చీరలు ఇట్టే చినిగిపోయాయని, మహిళలు ఉపయోగించలేని స్థితిలో ఉన్నాయని విమర్శలు వెల్లువెత్తాయి. పత్తి రైతుల సమస్యలు పరిష్కరించకుండా పత్తి కొనుగోళ్లు నిలిపివేసి, మరో పక్క చీరల పథకం తెచ్చిన తీరు పట్ల రైతు సంఘాలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి.
ఇక మరోవైపు, అధికారిక సమావేశాల్లో ముఖ్యమంత్రి దుస్తుల ఎంపికపై కూడా సోషల్ మీడియాలో చర్చ పెరిగింది. టీ-షర్ట్ వంటి అనధికారిక దుస్తులతో ముఖ్యమంత్రి ప్రజా కార్యక్రమాల్లో కనిపించడం రాజకీయ ప్రతిష్టకు అనుకూలం కాదని విమర్శకులు వ్యాఖ్యానించారు.
పంపిణీ షెడ్యూల్:
- గ్రామీణ ప్రాంతాలు: ఇందిరా గాంధీ జయంతి నుంచి డిసెంబర్ 9 – తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవం వరకు
- పట్టణ ప్రాంతాలు: మార్చి 1 నుంచి మార్చి 8 – అంతర్జాతీయ మహిళా దినోత్సవం వరకు
చీరల నాణ్యతపై ఎట్టి పరిస్థితుల్లో రాజీపడకూడదని, పారదర్శక పంపిణీ కోసం సాంకేతికతను వినియోగించాలనీ ముఖ్యమంత్రి ఆదేశించారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ తమ కలెక్టరేట్ల నుంచి వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొననున్నారు.
ఇక చివరగా, ఈ కార్యక్రమంపై ప్రజా అభిప్రాయం తెలుసుకునేందుకు ప్రభుత్వం కమ్యూనిటీలో పోలింగ్ నిర్వహించనుంది. ‘మీకు ఇంద్రమ్మ చీరలు కావాలా? వద్దా?’ అనే ప్రశ్నపై మహిళల అభిప్రాయాన్ని సేకరించనున్నారు.

