కొత్త ఎక్సైజ్ జీవోపై ఆగ్రహం: మౌన నిరసనకు దిగిన బార్ అసోసియేషన్ – ప్రభుత్వంపై తీవ్ర ఆక్షేపణలు

తెలంగాణలో కొత్తగా విడుదల చేసిన ఎక్సైజ్ జీవోపై రాష్ట్ర బార్ అసోసియేషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. నూతన నిబంధనలు అన్యాయమని, ఎవరి అభిప్రాయాలు అడగకుండా జీవోను ప్రవేశపెట్టడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ బార్ అసోసియేషన్ సభ్యులు సోమవారం హైదరాబాదులో మౌన నిరసన చేపట్టారు.

ఈ సందర్భంగా రాష్ట్ర బార్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ మాట్లాడుతూ– గత రెండు సంవత్సరాలుగా తమ సమస్యలను ఎక్సైజ్ శాఖ, మంత్రి, కమిషనర్‌కు ఎన్నోసార్లు తెలియజేసినా స్పందనలేదని మండిపడ్డారు.

మేము ప్రభుత్వానికి భారీగా రెవెన్యూ ఇస్తున్నాం. అయితే మా సమస్యలు మాత్రం ఎవరూ పట్టించుకోవడం లేదు. జీవో తీసుకురాకముందు మాతో చర్చ జరగాల్సింది.” అని వ్యాఖ్యానించారు

చట్టాలు అమలు చేయడంలో అధికారులు నిర్లక్ష్యం – ఆరోపణలు

అధికారులు నిర్లక్ష్యం చేస్తుండటం వల్లే వ్యాప్తిలో ఉన్న అనధికారిక బెల్ట్ షాపులు, పర్మిట్ రూముల వ్యవస్థ అదుపు తప్పిందని అసోసియేషన్ ఆరోపించింది.

“రూల్స్ ఉన్నా, ఎవరు పాటించడం లేదు. 100 స్క్వేర్ మీటర్లలో పర్మిట్ రూమ్ నడపాలని నిబంధన ఉన్నా ఎక్కడో ఎకరాలకొద్దీ పర్మిట్ రూములు నడుస్తున్నాయి. ఇవన్నీ అధికారుల నిర్లక్ష్య ఫలితాలు.” అని చెప్పారు

లైసెన్స్ ఫీజుల పెంపు, రిజిస్ట్రేషన్ నిబంధనలపై అభ్యంతరాలు

లైసెన్స్ రీన్యూవల్ ఫీజులు అకస్మాత్తుగా పెరగడం, రిజిస్టర్ డీడ్ తప్పనిసరి చేయడం, కొత్త బార్లకు ఔటర్ రింగ్ రోడ్ రూల్ అమలు వంటి నిర్ణయాలు పరిశ్రమకు పెద్ద భారమని అసోసియేషన్ అభిప్రాయపడింది.

“హైదరాబాద్‌లో చాలామంది బార్లు రిజిస్ట్రేషన్ లేకుండానే సంవత్సరాలుగా నడుస్తున్నాయి. అలాంటివి ఒక్కసారిగా రద్దు చేయమంటే సాధ్యం కాదు.” అని తెలిపారు.

కోర్టుకు వెళ్ళిన బార్లపై అధికారులు కక్షసాధింపు?

కొన్ని బార్లు కోర్టుకు వెళ్ళినందుకు, కావాలనే దాడులు చేసి కేసులు పెడుతున్నారని ఆరోపించారు.

ప్రతిపక్షంగా వుంటే కేసులు, రైడ్లు… ఇది ప్రజాస్వామ్యమేనా?” అని ప్రశ్నించారు.

డిమాండ్ల జాబితా:

బార్ అసోసియేషన్ ప్రభుత్వం ముందు ఉంచిన ముఖ్యమైన డిమాండ్లు ఇవి:

  • కొత్తగా ప్రవేశపెట్టిన జీవో తక్షణమే రద్దు చేయాలి
  • బార్ & వైన్ షాప్ రూల్స్‌ను స్పష్టంగా వేరు చేసి అమలు చేయాలి
  • పర్మిట్ రూమ్ రూల్స్‌ను కఠినంగా అమలు చేయాలి లేదా పూర్తిగా తొలగించాలి
  • రిన్యూవల్ మరియు లైసెన్స్ ఫీజులపై పునఃసమీక్ష చేయాలి
  • భవిష్యత్తులో ఏ జీవో అయినా అసోసియేషన్‌తో చర్చించకుండానే ప్రవేశపెట్టకూడదు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *