తెలంగాణలో తీవ్ర చలి: 28 జిల్లాల్లో 10 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు

తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర చలి వణికిస్తోంది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం ఉదయం వరకు రాష్ట్రంలోని 28 జిల్లాల్లో 23 జిల్లాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల సెల్సియస్‌కు దిగువగా నమోదయ్యాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్ మండలంలో అత్యల్పంగా 5.8 డిగ్రీల సెల్సియస్ నమోదు కావడంతో గత 10 ఏళ్ల రికార్డు బద్దలైంది.

డిసెంబర్ రెండో వారంలో ఇంత తక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కావడం ఇదే తొలిసారని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముఖ్యంగా డిసెంబర్ 12న ఈ స్థాయిలో చలి నమోదు కావడం గతంలో జరగలేదని వాతావరణ శాఖ అధికారి ధర్మరాజ్ వెల్లడించారు. వరుసగా రాత్రి పూట ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువగా పడిపోతుండటంతో ప్రజలు చలితో బెంబేలెత్తుతున్నారు.

గ్రామీణ ప్రాంతాలు, శివార్లలో చలి తీవ్రత మరింత ఎక్కువగా ఉండటంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చర్మం పగుళ్లు పడటం, చర్మం బారడం, కాళ్ల నుంచి నీరు రావడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

ఇంకా రెండు నుంచి మూడు రోజుల పాటు చలి తీవ్రత కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అత్యవసరం కాకపోతే ఉదయం పూట ప్రయాణాలను తగ్గించుకోవాలని, తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు. చలి ప్రభావంతో ప్రమాదాలు పెరిగే అవకాశముండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *