సర్పంచ్ ఎన్నికల్లో హస్తం హవా: ఉత్కంఠ ఫలితాలు, ఒక్క ఓటుతో గెలుపులు, బీఆర్ఎస్ వెనుకంజ

తెలంగాణలో జరిగిన సర్పంచ్ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ఉత్కంఠను రేపాయి. ఒక్క ఓటు తేడాతో గెలుపులు, కుటుంబ సభ్యుల మధ్యే పోటీలు, ఓటమిని తట్టుకోలేక గుండుపోటుతో అభ్యర్థుల మృతి వంటి విషాద ఘటనలు ఈ ఎన్నికలకు ప్రత్యేకతగా నిలిచాయి. మృతి చెందిన అభ్యర్థి చివరికి గెలుపొందడం రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

తండ్రి చేతిలో కొడుకు ఓటమి, అన్న చేతిలో సోదరి, అక్క చేతిలో చెల్లి ఓడిపోవడం వంటి ఘటనలు గ్రామ రాజకీయాల్లో పోటీ ఎంత తీవ్రంగా మారిందో సూచిస్తున్నాయి. మరోవైపు, మానకొండూరు ఎమ్మెల్యే స్వగ్రామంలోనే బీఆర్ఎస్ విజయం సాధించడం గమనార్హం.

మొత్తం ఫలితాల్ని పరిశీలిస్తే కాంగ్రెస్‌కు స్పష్టమైన హవా కనిపిస్తోంది. తొలి విడతలో కాంగ్రెస్‌కు 2426 స్థానాలు దక్కగా, బీఆర్ఎస్‌కు 1155, బీజేపీకి 199 స్థానాలు మాత్రమే లభించాయి. సీపీఐ, సీపీఎం, స్వతంత్రులు పరిమిత స్థానాలకే పరిమితమయ్యారు. రెండో విడతలో కూడా కాంగ్రెస్ ఆధిక్యం కొనసాగింది. కాంగ్రెస్‌కు 2331, బీఆర్ఎస్‌కు 1195, బీజేపీకి 255 స్థానాలు వచ్చాయి.

సిద్ధిపేట జిల్లాలో బీఆర్ఎస్‌కు 25 శాతం పైగా సీట్లు వచ్చినప్పటికీ, మూడు నాలుగు ప్రాంతాలు మినహా మిగతా జిల్లాల్లో పార్టీ స్పష్టంగా వెనుకబడినట్టుగా కనిపిస్తోంది. బీజేపీ మాత్రం రెండు విడతల్లో కలిపి కేవలం ఆరు శాతం స్థానాల్లోనే పరిమితమైంది.

మొత్తంగా చూస్తే, ఈ సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ హవా స్పష్టంగా కనిపించగా, బీఆర్ఎస్‌కు ఆశించిన స్థాయిలో లాభం దక్కలేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గ్రామస్థాయి రాజకీయాల్లో మార్పు మొదలైందా అనే ప్రశ్నలకు ఈ ఫలితాలు బలమిస్తున్నాయని చెప్పవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *