కేసీఆర్ చుట్టూ ఉన్నవాళ్లందరూ “దయ్యాలే” అంటూ విమర్శలు చేస్తుంటే, అదే కేసీఆర్ పక్కనే సంవత్సరాల పాటు ఉన్న నేతలు ఇప్పుడు కాంగ్రెస్‌లోకి రాగానే దేవుళ్లవుతారా? అన్న ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. కడియం శ్రీహరి ఉదాహరణగా ఈ విమర్శలు మరింత తీవ్రంగా మారాయి.
ఇన్ని రోజులు బీఆర్ఎస్‌లో కేసీఆర్ పక్కనే ఉండి, ఆయనకు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరించిన కడియం శ్రీహరి కూడా అప్పట్లో “దయ్యమేనా?” అన్న సందేహాన్ని ప్రజలు లేవనెత్తుతున్నారు. బీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు దయ్యం, కాంగ్రెస్‌లోకి వచ్చినాక దేవుడా? ఇది ఏ రకమైన రాజకీయ వాషింగ్ పౌడర్ వ్యవహారమని విమర్శకులు ప్రశ్నిస్తున్నారు.
కేసీఆర్ తమపై నమ్మకం పెట్టి ఎంపీ టికెట్లు ఇచ్చారని, ఎన్నికల ఖర్చులకు సహకరించారని ఆరోపణలు చేస్తూనే, అదే నాయకులు పార్టీ మారగానే కేసీఆర్‌ను, బీఆర్ఎస్‌ను విమర్శించడం “తిన్నింటి వాసాలు లెక్కపెట్టడం” కాదా అన్న వాదన వినిపిస్తోంది. ఫార్మ్ హౌస్ రాజకీయాలు, బ్యాగ్ పాలిటిక్స్ అంటూ ఆరోపణలు చేసిన నేతలే, అదే వ్యవస్థలో భాగంగా ఉండటం ప్రజలకు ఎలా అర్థమవుతుందని ప్రశ్నిస్తున్నారు.
ఇక బీఆర్ఎస్‌లో అంతర్గత కలహాలపై కూడా విమర్శలు వస్తున్నాయి. కవిత పార్టీకి దూరం కావడం, కేటీఆర్ – హరీష్ రావు మధ్య గ్యాప్ రావడం వెనుక కొందరు నేతలే కారణమన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరు కవిత అంటారు, మరొకరు హరీష్ అంటారు, ఇంకొకరు వేరే పేర్లు చెబుతుంటే ప్రజలు ఎవరిని నమ్మాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది.
భూముల వ్యవహారాలు, ల్యాండ్ గ్రాబింగ్ ఆరోపణలు, బినామీ రాజకీయాలు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్న నేతలందరూ కలిసి ప్రజలకు “ఈ చెవిలో పువ్వులు, ఆ చెవిలో పువ్వులు” పెడుతున్నారని విమర్శకులు ఆరోపిస్తున్నారు. ఎవరు గొప్ప, ఎవరు చెడ్డ అన్నదికన్నా, ఇది మొత్తం ఒక కొత్త రాజకీయ డ్రామాగా మారిందని అంటున్నారు.
మొత్తానికి బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కు వచ్చిన నేతలు దేవుళ్లవుతారా? లేక ఇది కేవలం రాజకీయ అవకాశవాదమా? అన్న ప్రశ్నలకు సమాధానం త్వరలోనే ప్రజల ముందుకు రానుందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి.

