రెండేళ్ల పాలన విజయాలపై అసెంబ్లీ చర్చా? సీఎం రేవంత్ ఆలోచనలపై ప్రశ్నలు

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా, ప్రభుత్వం సాధించిన విజయాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలనే అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచనలు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనపై రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది.

అయితే “రెండేళ్ల పాలన విజయాలు” అన్న మాట వినగానే ప్రజల్లో అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. రెండు సంవత్సరాల్లో నిజంగా ఏం సాధించారన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఫుట్‌బాల్ ఈవెంట్లు నిర్వహించడం ఒక విజయమా? కేబుల్ ఆపరేటర్లను ఇబ్బందులకు గురి చేయడం పాలన విజయమా? రైతులకు ఇప్పటివరకు గిట్టుబాటు ధరలు లేకపోవడం, పత్తి కొనుగోళ్లు జరగకపోవడం, వరి పంటలు నష్టపోవడం – ఇవన్నీ కూడా విజయాలేనా అన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వరదలు వచ్చి ఇళ్లు మునిగిపోయిన బాధితులకు సరైన పరిహారం అందకపోవడం, ఇంద్రమ్మ ఇళ్ల పథకం కింద చాలా మందికి ఇప్పటికీ ఇళ్లు రాకపోవడం ప్రభుత్వ వైఫల్యంగా ప్రజలు భావిస్తున్నారు. ఇళ్లు ఎలా కడుతున్నారు అని చూడటానికి వెళ్తే, అక్కడ స్థానిక ఎమ్మెల్యేల పాత్రపైనా ఆరోపణలు వస్తున్నాయి.

అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు వేతనాలు లేవు, స్టాఫ్ నర్సులకు జీతాలు అందడం లేదు, రిటైర్మెంట్ అయిన టీచర్లకు పెన్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో “విజయాలపై అసెంబ్లీ సమావేశాలు” నిర్వహించాలన్న ఆలోచన ప్రజల్లో వ్యంగ్యానికి దారి తీస్తోంది. సమస్యలపై చర్చించాల్సిన సమయంలో, విజయాల పేరుతో సమావేశాలు పెట్టడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

ఇదిలా ఉండగా, సర్పంచ్ ఎన్నికల అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ నుంచే ఫాలోఅప్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓట్ చోరీ గద్దీ చోడ్ సభ కోసం ఢిల్లీ వెళ్లిన సీఎం, అక్కడే ఉండి రెండో విడత సర్పంచ్ ఎన్నికల ఫలితాలు, మూడో విడత పోలింగ్ ఏర్పాట్లపై పార్టీ కీలక నేతలతో చర్చలు జరిపినట్టు సమాచారం. 3,752 గ్రామ పంచాయతీలకు ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయని అధికారులు వెల్లడించారు.

మొత్తంగా చూస్తే, రెండేళ్ల పాలనపై అసెంబ్లీ వేదికగా ప్రభుత్వం ఏం చెప్పబోతోందో, ప్రజలు ఆ వాదనలను విజయాలుగా అంగీకరిస్తారా లేక వైఫల్యాలుగా చూస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *