తెలుగు సినీ సంగీత చరిత్రలో చెరగని సంతకం చేసిన గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం రవీంద్ర భారతిలో ఆవిష్కృతమైంది. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నేతలు, కళాకారులు పాల్గొని బాలు సేవలను గుర్తు చేశారు. మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ, అభిమానుల ప్రేమకు ప్రతీకగా బాలు విగ్రహం నిత్య చిహ్నంగా నిలుస్తుందని అన్నారు.
అయితే ఈ విగ్రహ ఆవిష్కరణకు ముందు రోజులు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. “బాలు విగ్రహం పెట్టొద్దు”, “ధర్నాలు చేస్తాం”, “రాస్తారోకోలు నిర్వహిస్తాం” అంటూ కొందరు నేతలు, సంఘాలు బహిరంగ హెచ్చరికలు చేశారు. అవసరమైతే విగ్రహాన్ని అడ్డుకుంటామని కూడా వ్యాఖ్యానించారు.
కానీ నిన్న విగ్రహ ఆవిష్కరణ ప్రశాంతంగా, ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తవడం రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారి తీసింది. ఇన్ని రోజులు మీడియా చర్చల్లో గట్టిగా మాట్లాడినవార వచ్చి ఎందుకు అడ్డుకోలేకపోయారు? వెంకయ్య నాయుడు, రామచంద్రరావు వంటి ప్రముఖులు పాల్గొన్నా ఎలాంటి నిరసన కనిపించలేదు.
ఎస్పీ బాలు తెలంగాణ పాటలు పాడలేదని, తెలంగాణ గీతంపై ఆయన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయని చెప్పినవారు, ఆగ్రహం అంతా డిబేట్ల వరకే పరిమితమైందా అనే ప్రశ్న ఇప్పుడు వినిపిస్తోంది. విగ్రహం పెట్టొద్దని చెప్పినవారు, ఆవిష్కరణ సమయంలో ఎందుకు మౌనం పాటించారన్నది ప్రజల్లో ఆసక్తిగా మారింది.
ఇంతటి వివాదం నడిచినప్పటికీ ప్రభుత్వం మాత్రం చీమ కుట్టినట్టు కూడా స్పందించలేదన్న విమర్శలు వస్తున్నాయి. హౌస్ అరెస్టులు, కఠిన చర్యలు ఉంటాయన్న ప్రచారం జరిగినా, చివరికి విగ్రహం ఆవిష్కరణ సజావుగా జరగడం విశేషం.
మొత్తానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహం చుట్టూ సాగిన వివాదం, రాజకీయ బెదిరింపులు ఎంతవరకు వాస్తవం? ఎంతవరకు మీడియా స్టూడియోలకు మాత్రమే పరిమితమా? అన్న ప్రశ్నలను మిగిల్చింది. ఇప్పుడు ఈ అంశంపై ప్రజాభిప్రాయం ఏంటి అనేది రాజకీయ వర్గాల్లో కీలకంగా మారింది.

