తెలంగాణ ఆత్మగౌరవంపై దాడులు సహించంవిగ్రహాల నుంచి ఐడీపీఎల్ భూముల వరకు పోరాటం కొనసాగుతుంది

తెలంగాణ ప్రజలు ఇప్పటికే ఎన్నో గాయాలతో ఉన్నారని, ఆ గాయాలపై మళ్లీ పుండు మీద కారం చల్లినట్టుగా పాలకులు వ్యవహరిస్తున్నారని నేత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో గాయపడ్డ ప్రజలు మార్పు కోసం కొంత శాంతన పొందాలని భావిస్తే, మరింత బాధను మిగిల్చే నిర్ణయాలు తీసుకుంటున్నారని విమర్శించారు.

విగ్రహాల ఏర్పాటు మాత్రమే సమస్య కాదని, అక్రమ పద్ధతుల్లో, అహంకారంతో తెలంగాణ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా తీసుకునే నిర్ణయాలే అసలు సమస్య అని స్పష్టం చేశారు. తెలంగాణ సంస్కృతి, చరిత్ర, ఆత్మగౌరవాన్ని కించపరిచే ప్రతి చర్యకు ప్రజల్లో చైతన్యం ఉందని, ఆ శక్తి తప్పకుండా బయటపడుతుందని హెచ్చరించారు.

బాలసుబ్రహ్మణ్యం పాటలను ఎవ్వరూ వ్యతిరేకించరని, ఆయన ప్రతిభకు గౌరవం ఉందని చెబుతూనే, “తెలంగాణ పాట పాడమంటే గాయపడతామా లేదా?” అనే ప్రశ్నను ముందుకు తెచ్చారు. ఇది కేవలం వ్యక్తి విషయం కాదని, తెలంగాణ సంస్కృతికి సంబంధించిన ఆత్మగౌరవ అంశమని తెలిపారు. ప్రజలు వ్యతిరేకిస్తున్నా, వినిపించుకోకుండా నిర్ణయాలు తీసుకోవడం మరింత బాధాకరమన్నారు.

తాత్కాలికంగా ఎవరు గెలిచినట్టు కనిపించినా, చివరికి న్యాయం తప్పకుండా గెలుస్తుందని, అయితే గెలిచేదంతా న్యాయమే కాదు అనే వాస్తవాన్ని గుర్తుచేశారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసే పేర్లు, విగ్రహాలు, గుర్తింపులను భవిష్యత్తులో తప్పకుండా మార్చుకుంటామని, అవసరమైతే మరో ఉద్యమానికి సిద్ధమవుతామని స్పష్టం చేశారు.

తెలంగాణ సినిమా పరిస్థితి కూడా అంతే దురదృష్టకరంగా ఉందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడి పదేళ్లు అయినా, తెలంగాణకు తగిన అవకాశాలు, గుర్తింపు రాకపోవడం వెనుక కుట్రలు ఉన్నాయని ఆరోపించారు. అమరుల త్యాగాలు, ఉద్యమకారుల ఆకాంక్షలు మరిచి మళ్లీ ప్రజలను దుఃఖంలోకి నెట్టే పరిస్థితులు ఏర్పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక ఐడీపీఎల్ భూముల అంశంపై మాట్లాడుతూ, ఒక్క ఐడీపీఎల్ మాత్రమే కాకుండా రాష్ట్రంలోని ప్రభుత్వ భూములన్నింటిపై సమగ్ర విచారణ జరగాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు కలిసి ప్రభుత్వ ఆస్తులను కాజేసే విధానాన్ని ఒక ‘డెఫినిషన్’లా మార్చారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో విచారణకు ముందుకు వచ్చిన ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, కానీ అది నిష్పక్షపాతంగా, నిజాయితీగా సాగాలని కోరారు.

ఈ విచారణ తాత్కాలిక ఉపశమనం కోసం కాకుండా, భవిష్యత్తులో ఎవ్వరూ అక్రమాలకు పాల్పడే ధైర్యం చేయని విధంగా ఉండాలన్నారు. గ్రామ స్థాయి నుంచి వచ్చిన ప్రజల దరఖాస్తుల్ని కూడా పరిశీలించి, శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. బినామీలు, మాఫియాలు, అధికార యంత్రాంగం అండతో సాగుతున్న భూ కబ్జాలకు తెరదించాలని అన్నారు.

ప్రజలే చైతన్యవంతం కావాలని, అన్యాయం జరిగినప్పుడు ఎదురుదిరగాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. కోర్టులు, చట్టాలు, ప్రభుత్వం సమాన న్యాయం అందించాల్సిన బాధ్యత ఉందని, బాధితుడు ఒంటరిగా మిగిలిపోవడం దురదృష్టకరమని అన్నారు.

పంచాయతీ ఎన్నికలపై స్పందిస్తూ, ఈసారి పార్టీ గుర్తులకంటే వ్యక్తిగతంగా ప్రజలకు అందుబాటులో ఉన్న అభ్యర్థులకే ప్రజలు ఓటు వేస్తున్నారని చెప్పారు. జాగృతి కార్యకర్తలు పలుచోట్ల స్థానిక బలంతో గెలిచారని తెలిపారు. తమ లక్ష్యం వచ్చే సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి, జరిగిన అక్రమాలు, అన్యాయాలను వెలికి తీయడమేనని స్పష్టం చేశారు.

చివరగా, తెలంగాణ ఆత్మగౌరవం, ప్రజల హక్కులు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణ కోసం పోరాటం ఆగదని, ప్రజల మద్దతుతో ముందుకు సాగుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *