ఒకప్పటితో పోల్చుకుంటే ఈమధ్య కాలంలో ప్రేక్షకుల అభిరుచి పూర్తిగా మారిపోయింది. కథలో నిజాయితీ, పాత్రల్లో సహజత్వం కోరుకుంటున్న ప్రేక్షకుల కోసం నటీనటులు ఎంతటి కష్టాన్నైనా భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా చారిత్రక చిత్రాల్లో నటించడం అంటే శారీరకంగా, మానసికంగా భారీ సవాలే.
ఈ కోవలోనే ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ వారసుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘ఛావా’ లో విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో నటించారు. ఈ చిత్రంలో రష్మిక మందన్న శంభాజీ మహారాజ్ భార్య పాత్రలో కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ప్రత్యేకంగా ఈ సినిమాలోని క్లైమాక్స్ సన్నివేశం ప్రేక్షకులను కదిలించింది. శంభాజీ మహారాజ్‌ను బంధించి చిత్రహింసలు పెట్టే ఆ సన్నివేశం ఎంత కీలకమో తెలిసిందే. అయితే ఆ సన్నివేశం కోసం తాను ఎదుర్కొన్న బాధను విక్కీ కౌశల్ తాజాగా వెల్లడించారు.
విక్కీ మాట్లాడుతూ,
“క్లైమాక్స్ సన్నివేశాల షూటింగ్ ప్రారంభించిన మూడో రోజే నాకు తీవ్ర గాయమైంది. దాంతో దాదాపు ఒకటిన్నర నెలల పాటు షూటింగ్‌కు విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఆ సమయంలో ప్రత్యేకంగా వేసిన సెట్‌ను కూడా తొలగించాల్సి వచ్చింది. రెండు నెలల తర్వాత మళ్లీ కొత్తగా సెట్ నిర్మించి, మొత్తం 12 రోజుల పాటు ఆ సన్నివేశాన్ని చిత్రీకరించాం. నిజంగా ఆ రోజుల్లో నరకం అంటే ఏంటో మాకు అర్థమైంది” అని తెలిపారు.
శంభాజీ మహారాజ్ జీవితాన్ని ప్రపంచానికి నిజాయితీగా చూపించాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ 100 శాతం అంకితభావంతో పనిచేశారని విక్కీ తెలిపారు. తన కష్టం ప్రేక్షకుల ప్రశంసల రూపంలో తిరిగి రావడం తనకు ఎంతో సంతృప్తినిచ్చిందన్నారు.
విక్కీ కౌశల్ విషయానికి వస్తే, ఆయన తన అద్భుతమైన నటనతో నేషనల్ అవార్డు సహా మూడు ఫిలింఫేర్ అవార్డులు గెలుచుకున్నారు. 2019లో ఫోర్బ్స్ ఇండియా సెలబ్రిటీ 100 జాబితాలో కూడా చోటు దక్కించుకున్నారు. 2021లో ప్రముఖ హీరోయిన్ కత్రినా కైఫ్‌ను వివాహం చేసుకున్న ఆయన, ఈ ఏడాది తండ్రిగా కొత్త జీవితాన్ని ప్రారంభించారు. ఒకవైపు కుటుంబ జీవితం, మరోవైపు వరుస సినిమాలతో విక్కీ కౌశల్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నారు.

