హనుమకొండ: ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత, నటుడు Pawan Kalyan మరోసారి తన అభిమానుల పట్ల ఉన్న ప్రేమను చాటుకున్నారు. అరుదైన జన్యుపరమైన నరాల వ్యాధితో బాధపడుతున్న 17 ఏళ్ల అభిమాని నిరంజన్ కోరికను నెరవేర్చి అందరి ప్రశంసలు అందుకుంటున్నారు.
హనుమకొండలోని హనుమాన్ నగర్ కాలనీలో నివసిస్తున్న నిరంజన్ చాలా కాలంగా అరుదైన నరాల వ్యాధితో మంచానికే పరిమితమయ్యాడు. చిన్ననాటి నుంచే పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన అతను తన అభిమాన హీరోను ఒక్కసారైనా కలవాలని కోరిక వ్యక్తం చేశాడు. ఈ విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి జూన్ 17న స్వయంగా నిరంజన్ ఇంటికి వెళ్లి పరామర్శించారు.
నిరంజన్ ఆరోగ్య పరిస్థితి, కుటుంబ పరిస్థితులను తెలుసుకున్న పవన్ కళ్యాణ్ అతనికి తిరుమల శ్రీవారి తీర్థప్రసాదాలు, వస్త్రాలు అందించి ఆశీర్వదించారు. అంతేకాకుండా వైద్య ఖర్చుల నిమిత్తం రూ.1 లక్ష ఆర్థిక సహాయం కూడా ప్రకటించారు.
ఈ సందర్భంగా “నీకు ఏం కావాలి?” అని పవన్ కళ్యాణ్ అడగగా, తనకు ఒక ఐప్యాడ్‌తో పాటు నటుడు Ram Charan వద్ద ఉన్నటువంటి టాయ్ పూడల్ జాతికి చెందిన కుక్కపిల్ల కావాలని నిరంజన్ కోరాడు. వెంటనే స్పందించిన పవన్ కళ్యాణ్ ఆ కోరికను కూడా నెరవేర్చుతానని హామీ ఇచ్చారు.
ఇచ్చిన మాట ప్రకారం గంట వ్యవధిలోనే ఐప్యాడ్‌తో పాటు టాయ్ పూడల్ జాతికి చెందిన కుక్కపిల్లను నిరంజన్ ఇంటికి పంపించారు. కుక్కపిల్లను చూసిన నిరంజన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ కుక్కపిల్లకు “రెక్స్” అని పేరు పెట్టినట్లు తెలిపాడు.
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కువగా చర్చనీయాంశంగా మారింది టాయ్ పూడల్ కుక్కపిల్ల ధర. మార్కెట్లో ఈ జాతికి చెందిన కుక్కపిల్లల ధర వాటి బ్రీడ్, రిజిస్ట్రేషన్, బ్లడ్‌లైన్, రంగు వంటి అంశాల ఆధారంగా రూ.70 వేల నుంచి రూ.3 లక్షల వరకు ఉండొచ్చని పెంపుడు జంతు నిపుణులు చెబుతున్నారు.
అలాగే పవన్ కళ్యాణ్ బహుమతిగా పంపిన ఐప్యాడ్ కూడా మోడల్‌ను బట్టి రూ.70 వేల నుంచి లక్ష రూపాయల వరకు విలువ ఉండే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
అయితే ఈ ఘటనలో బహుమతుల విలువ కంటే ఒక అభిమాని కోరికను తీర్చాలనే పవన్ కళ్యాణ్ ఆప్యాయత, మానవత్వం, అభిమానుల పట్ల చూపిన ప్రేమే అందరినీ ఎక్కువగా ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

