ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే కొనసాగుతున్న సిట్ దర్యాప్తును మరింత బలోపేతం చేస్తూ, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో తొమ్మిది మంది సీనియర్ పోలీస్ అధికారులతో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ శివధర్ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేస్తూ, నెలరోజుల్లో దర్యాప్తును పూర్తి చేయాలని ఆదేశించారు.
ఈ ప్రత్యేక దర్యాప్తు బృందంలో రామగుండం కమిషనర్ అంబర్ కిషోర్, సిద్ధిపేట సీపీ ఎస్.ఎం. విజయ్ కుమార్, మాదాపూర్ డీసీపీ రీత్రాజ్, మహేశ్వరం డీసీపీ కే. నారాయణరెడ్డి, రోహిణి గ్రూప్ కమాండర్ ఎం. రవీందర్ రెడ్డి, రాజేంద్రనగర్ ఏడీసీపీ కేఎస్ రావు, జూబిలీ హిల్స్ ఏఎస్పీ వెంకటగిరి, దర్యాప్తు అధికారి నాగేంద్రరావు, హెచ్ఎంఆర్ఎల్ సీఈహెచ్ శ్రీధర్ ఉన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో భిన్న కోణాలు వెలుగులోకి వస్తుండటంతో, ఒక్కొక్క కీలక అంశంపై ఒక్కో అధికారికి బాధ్యతలు అప్పగించారు.
ట్యాపింగ్‌కు సంబంధించి ఆదేశాలు ఇచ్చిన వారు, ఆ ఆదేశాలు అమలు చేసిన వారు, ట్యాపింగ్ ద్వారా సేకరించిన సమాచారాన్ని ఎవరికి చేరవేశారన్న అంశాలపై స్పష్టత తీసుకురావడమే ప్రభుత్వ లక్ష్యంగా తెలుస్తోంది. రాజకీయ ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కేసులో నిజానిజాలు వెలికితీయాలని ప్రభుత్వం గట్టి నిర్ణయంతో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఇదిలా ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న మాజీ ఎస్ఐబీ చీఫ్ ప్రభాకర్ రావు కస్టడీ ముగిసింది. ఏడురోజుల పాటు విచారణ జరిపిన సిట్ అధికారులు, ఆయన నుంచి పూర్తి సమాచారం రాబట్టలేకపోయినట్లు సమాచారం. ప్రభాకర్ రావు కీలక విషయాలు దాచిపెడుతున్నాడన్న అనుమానంతో, మరో వారం రోజుల కస్టడీ కోసం శుక్రవారం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని సిట్ భావిస్తున్నట్లు తెలుస్తోంది
సిట్ విచారణలో ప్రభాకర్ రావు వెల్లడించిన అంశాలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ సమీక్ష నిర్వహించి, దర్యాప్తును మరింత లోతుగా తీసుకెళ్లాలని సూచనలు చేసినట్లు సమాచారం. మావోయిస్టుల పేరుతో ప్రైవేట్ వ్యక్తుల ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసిన విషయం స్పష్టమవుతున్నా, ఆ ట్యాపింగ్ ఎందుకు జరిగింది? ఎవరి ఆదేశాలతో జరిగింది? ట్యాపింగ్ సంభాషణల రికార్డులు ఎవరికి పంపించారు? వంటి కీలక ప్రశ్నలకు సమాధానాలు దొరకాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు.
అప్పటి రాజకీయ నాయకత్వం, హోంశాఖ అధికారులు, ఉన్నతస్థాయి నేతల పాత్రపై కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సొంత పార్టీ నేతల సంభాషణలు సైతం ట్యాప్ అయ్యాయన్న ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో, ప్రధాన నిందితుల్ని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించకపోతే ఈ కేసు తేలే పరిస్థితి లేదని దర్యాప్తు అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం రాష్ట్ర రాజకీయాల్లో మరింత సంచలనం సృష్టించే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

