తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలు ఘన విజయం సాధించారు. రిజర్వ్డ్ స్థానాలతో పాటు జనరల్ స్థానాల్లో కూడా బీసీలు పోటీ చేసి మెజారిటీ సర్పంచ్ స్థానాలను గెలుచుకోవడం రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామంగా మారింది. ఇది బీసీల్లో పెరుగుతున్న రాజకీయ చైతన్యానికి స్పష్టమైన నిదర్శనమని బీసీ జేఏసీ నేతలు పేర్కొంటున్నారు.
బీసీ జేఏసీ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ మాట్లాడుతూ, “ఇది పార్టీల గెలుపు కాదు.. ఇది బీసీల గెలుపు, బీసీల ప్రభంజనం” అని స్పష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో బీసీలే ప్రధానంగా నివసిస్తున్నారని, పార్టీ చిహ్నాలు లేని ఎన్నికల్లో ఎక్కువ మంది స్వతంత్రులుగా పోటీ చేసి బీసీలు విజయం సాధించారని తెలిపారు.
మరోవైపు 42 శాతం బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన బిల్లు రాష్ట్రపతి ఆమోదం కోసం పెండింగ్‌లో ఉండగా, రాష్ట్రపతి తెలంగాణకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయినా ఈ అంశంపై కేంద్రం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ స్పష్టమైన చొరవ చూపకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్లమెంట్ సమావేశాలు 21 రోజుల పాటు జరిగినప్పటికీ, బీసీల గురించి కనీసం 21 నిమిషాలైనా చర్చ జరగలేదని జాజుల శ్రీనివాస్ ఆరోపించారు. బీసీల ఓట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీలు ఇప్పుడు బీసీల సమస్యలను విస్మరిస్తున్నాయని, కాంగ్రెస్, బీజేపీ రెండూ బీసీ రిజర్వేషన్ల విషయంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు.
42% రిజర్వేషన్లు అమలు చేయకుండా స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ–జెడ్పీటీసీ ఎన్నికల మాటలు చెప్పడం బీసీలను మోసం చేయడమేనని ఆయన అన్నారు. ఈ పరిస్థితులకు నిరసనగా బీసీ జేఏసీ అష్టాంగ ఆందోళన కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు.
ఇప్పటికే ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా, జాతీయ సదస్సు నిర్వహించిన బీసీ జేఏసీ, త్వరలో తెలంగాణ వ్యాప్తంగా బీసీ రథయాత్ర చేపట్టనుంది. హైదరాబాద్‌లో 10 లక్షల మందితో “బీసీ సింహగర్జన” సభ నిర్వహించి, దేశవ్యాప్తంగా 42% బీసీ రిజర్వేషన్ సాధించే వరకు పోరాటం కొనసాగిస్తామని నేతలు స్పష్టం చేశారు.

