శీతాకాల సమావేశాల “సక్సెస్” వెనుక అసలు కథ.. తేనేటి విందులో కలిసిన మోదీ–ప్రియాంక

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు అత్యంత విజయవంతంగా ముగిశాయని లోక్‌సభ స్పీకర్ ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన ఇచ్చిన తేనేటి విందుకు ప్రధాని నరేంద్ర మోదీ, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీతో పాటు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. ఆ విందులోని ఫోటోలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

మొన్నటివరకు పార్లమెంట్‌లో ప్రియాంక గాంధీ–అమిత్ షా మధ్య తీవ్ర స్థాయిలో మాటల యుద్ధం నడిచింది. కాంగ్రెస్, బీజేపీ మధ్య ఆరోపణలు–ప్రత్యారోపణలు, నిరసనలు, ర్యాలీలు జోరుగా జరిగాయి. కానీ ఇప్పుడు అదే నేతలు తేనేటి విందులో కూల్‌గా కూర్చుని నవ్వుతూ మాట్లాడుకోవడం రాజకీయ ద్వంద్వ వైఖరికి నిదర్శనమా అన్న ప్రశ్నలు తెరపైకి వచ్చాయి.

శీతాకాల సమావేశాల్లో లోక్‌సభ 111 శాతం, రాజ్యసభ 121 శాతం ఫలవంతంగా పనిచేశాయని కేంద్రం చెబుతోంది. మొత్తం ఎనిమిది కీలక బిల్లులకు ఉభయ సభల ఆమోదం లభించిందని వెల్లడించింది. కాలుష్యంపై చర్చను ప్రతిపక్షాలు అడ్డుకున్నాయని, అయినప్పటికీ సమావేశాలు విజయవంతంగా ముగిశాయని కేంద్రం అభిప్రాయపడుతోంది.

ఇదే సమయంలో మహాత్మా గాంధీ పేరును మార్చబోతున్నారనే ప్రచారంపై కాంగ్రెస్ దేశవ్యాప్తంగా ర్యాలీలు నిర్వహించింది. బీజేపీ కార్యాలయాల ముట్టడులు, కేంద్రంపై కుట్ర ఆరోపణలు చేసిన కాంగ్రెస్ నేతలు, ఇప్పుడు అదే బీజేపీ నేతలతో కలిసి విందులో పాల్గొనడంపై ప్రజల్లో అనుమానాలు పెరుగుతున్నాయి.

“లోపల లోపల అందరూ దోస్తులేనా? బయట మాత్రమే రాజకీయ యుద్ధమా?” అనే ప్రశ్న సామాన్యుల మనసుల్లో మెదులుతోంది. ప్రజల ముందు తీవ్ర విమర్శలు, ఆరోపణలు చేస్తూ.. వెనుక మాత్రం సఖ్యతతో వ్యవహరించడం రాజకీయాల్లో సాధారణమైందా? లేక ఇది ప్రజలను మభ్యపెట్టే రాజకీయ నాటకమా? అన్న చర్చ సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది.

మొత్తానికి శీతాకాల సమావేశాల సక్సెస్ కంటే, తేనేటి విందులో కనిపించిన రాజకీయ స్నేహమే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు కేంద్రబిందువుగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *