అమీన్పూర్ (పటాన్చెరు నియోజకవర్గం)లో భూ కబ్జాల వ్యవహారం మరోసారి తీవ్ర దుమారం రేపుతోంది. ప్రభుత్వ భూములు, చెరువులు, ఎఫ్టీఎల్, బఫర్ జోన్లపై అక్రమ నిర్మాణాలను కూల్చేందుకు ఏర్పాటైన హైడ్రా (HYDRA) పదేపదే బుల్డోజర్ చర్యలు చేపడుతున్నా, అదే స్థలంలో మళ్లీ కబ్జాలు జరుగుతుండటం స్థానికులను ఆందోళనకు గురి చేస్తోంది.
అమీన్పూర్ హెచ్ఎంటీ కాలనీలో కాటసాని రాంభూపాల్, సిస్లా రమేష్, సిస్లా లోహిత్ కలిసి ప్లాట్లను అక్రమంగా ఆక్రమించారని బాధితులు ఆరోపిస్తున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఆదేశాలతో ఇప్పటివరకు పలు మార్లు అక్రమ గోడలు, ప్రహరీలు కూల్చివేసినా, అధికారులు వెళ్లిన వెంటనే మళ్లీ కడీలు పాతి దారులు మూసివేయడం జరుగుతోందని స్థానికులు వాపోతున్నారు.
బాధితుల కథనం ప్రకారం గత రెండేళ్లుగా ఈ భూముల కోసం న్యాయపోరాటం కొనసాగుతోంది. హైడ్రా దాదాపు ఎనిమిది సార్లు వచ్చి డెమోలిషన్ చేసినా, శాశ్వత పరిష్కారం మాత్రం కనిపించడం లేదు. రెవెన్యూ, ఇరిగేషన్, మున్సిపల్ శాఖల స్థానిక అధికారులు కబ్జాదారులతో కుమ్మక్కయ్యారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు, హైడ్రా కమిషనర్ రంగనాథ్ బాధితుల పక్షాన నిలిచి కఠిన హెచ్చరికలు జారీ చేశారని బాధితులు చెబుతున్నారు. అయితే అమీన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఫేక్ కేసులు, ఎస్సీ/ఎస్టీ కేసుల బెదిరింపులతో తమను భయపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు.
భూ కబ్జాలపై శాశ్వత పరిష్కారం చూపాలని, లేఅవుట్ను తక్షణమే ఖరారు చేసి ఎవరిది వాళ్లకు అప్పగించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే అమీన్పూర్లో ప్రత్యేక హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఈ వ్యవహారంపై డీజీపీ శివధర్ రెడ్డి స్పందించి, అవినీతిలో ఉన్న అధికారులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.

