తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ మావోయిస్టు నేత గాధ ఇన్నయ్యను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అరెస్ట్ చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. జంగామ జిల్లా జఫర్గడ్ మండలం రేగడి తాండా పరిధిలోని “మా ఇల్లు – ప్రజాధరణ ఆశ్రమం” నుంచి ఆదివారం ఉదయం ఆయనను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ పోలీసులు, మావోయిస్టులకు అనుకూల వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఉపా (UAPA) చట్టం కింద కేసు నమోదు చేశారు. నాంపల్లి కోర్టులో హాజరు పరచగా 14 రోజుల రిమాండ్ విధించారు.
గాధ ఇన్నయ్య గతంలో మావోయిస్టు ఉద్యమంతో సంబంధం కలిగి ఉన్నప్పటికీ, చాలా సంవత్సరాల క్రితమే ఆయుధ పోరాటాన్ని వీడి జనజీవనంలోకి వచ్చారు. ఒక ఎన్‌కౌంటర్ ఘటనలో చేయి కోల్పోయిన ఆయన, వరంగల్ ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసి అనాధ, నిరుపేద పిల్లలను చేరదీసి చదివించడంతో పాటు అనేక సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తూ గుర్తింపు పొందారు. ముఖ్యంగా బాలికల విద్య, వివాహాల కోసం కృషి చేయడం వల్ల ఆయనపై సామాన్య ప్రజల్లో మంచి అభిప్రాయం ఉంది.
ఛత్తీస్‌గఢ్‌లో ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జరిగిన సంస్మరణ సభలు, అంత్యక్రియల్లో పాల్గొని గాధ ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలే ఈ అరెస్టుకు కారణమని ఎన్ఐఏ పేర్కొంది. మావోయిస్టు ఉద్యమాన్ని ప్రోత్సహించేలా మాట్లాడటం, నిషేధిత సంస్థకు మద్దతు తెలిపినట్లుగా భావించి చర్యలు తీసుకున్నట్లు నోటీసుల్లో వెల్లడించింది.
అయితే, తెలంగాణ ఉద్యమకారులు, పౌరహక్కుల సంఘాలు, రాజకీయ పార్టీలు ఈ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాయి. వాక్ స్వేచ్ఛ, భావ వ్యక్తీకరణ హక్కు భారత రాజ్యాంగం కల్పించిన మౌలిక హక్కులని, కేవలం అభిప్రాయం వ్యక్తం చేసినందుకే అరెస్ట్ చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని వారు అంటున్నారు. గాధ ఇన్నయ్య లాంటి ఉద్యమకారులను “అర్బన్ నక్సల్స్” పేరుతో అణిచివేయడం కేంద్ర ప్రభుత్వ కక్షసాధింపు చర్యగా వారు అభివర్ణిస్తున్నారు.
తెలంగాణ ఉద్యమకారుల జేఎసి, సీపీఐ (ఎంఎల్) మాస్‌లైన్, కళాకారుల వేదిక తదితర సంఘాలు గాధ ఇన్నయ్యను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశాయి. అభిప్రాయం వ్యక్తం చేసిన ప్రతి ఒక్కరినీ అరెస్ట్ చేస్తే దేశంలో ప్రజాస్వామ్యం ఎలా నిలుస్తుందనే ప్రశ్నను వారు లేవనెత్తుతున్నారు.

