రవాణా శాఖలో అవినీతి తిమింగలం.. డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ కిషన్ నాయక్ వద్ద రూ.200 కోట్ల ఆస్తులు బయటపడ్డాయి

రవాణా శాఖలో భారీ అవినీతి తిమింగలం వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లా డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ (డీటీసీ) ఎం. కిషన్ నాయక్ వద్ద ఆదాయానికి మించిన ఆస్తులు భారీగా ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం ఆయన వద్ద ఉన్న ఆస్తుల బహిరంగ మార్కెట్ విలువ సుమారు రూ.200 కోట్ల వరకు ఉంటుందని ఏసీబీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో కిషన్ నాయక్‌ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.

ఆదాయానికి మించిన ఆస్తులు ఉన్నాయన్న ఫిర్యాదుల మేరకు మంగళవారం ఏసీబీ అధికారులు హైదరాబాద్, మహబూబ్‌నగర్, నిజామాబాద్, నారాయణఖేడ్ సహా మొత్తం 12 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. హైదరాబాద్ ఓల్డ్ బోయినపల్లిలోని నివాసంతో పాటు, మహబూబ్‌నగర్ జిల్లా రవాణా శాఖ కార్యాలయం, ఆయన బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సైతం విస్తృత తనిఖీలు చేపట్టారు.

ఈ సోదాల్లో కిషన్ నాయక్‌కు చెందిన 41 ఎకరాల వ్యవసాయ భూములు, కిలో బంగారు ఆభరణాలు, బ్యాంక్ ఖాతాల్లో కోటి రూపాయలకుపైగా నగదు, అలాగే ఇంట్లో రూ.37 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిజామాబాద్‌లోని లహరీ ఇంటర్నేషనల్ హోటల్‌లో 50 శాతం వాటా, అక్కడే ఉన్న రాయల్ ఓక్ ఫర్నిచర్ షోరూమ్‌కు అద్దెకిచ్చిన 3,000 గజాల వాణిజ్య స్థలం, అశోక టౌన్‌షిప్‌లో రెండు ఫ్లాట్లు, సుమారు 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో పాలీహౌస్ ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

కిషన్ నాయక్ స్వగ్రామమైన సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బల్కం చిలక తాండాలోని ఆయన నివాసం ప్యాలెస్‌ను తలపించేలా ఉందని అధికారులు తెలిపారు. అలాగే హైదరాబాద్ దిల్‌సుఖ్‌నగర్‌లోని ఆయన బంధువు విజయ్ నివాసంలో పలు కీలక ఆస్తుల పత్రాలను కూడా ఏసీబీ స్వాధీనం చేసుకుంది. నారాయణఖేడ్‌లో 31 ఎకరాలు, నిజామాబాద్‌లో 10 ఎకరాల వ్యవసాయ భూములు ఉన్నట్లు విచారణలో తేలింది.

స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్లు, ఖాతాల ఆధారంగా లెక్కిస్తే కిషన్ నాయక్ ఆస్తుల విలువ సుమారు రూ.12.72 కోట్లుగా కనిపిస్తున్నప్పటికీ, ప్రస్తుత బహిరంగ మార్కెట్ విలువను పరిగణనలోకి తీసుకుంటే అవి రూ.200 కోట్ల వరకు ఉంటాయని ఏసీబీ డీజీ చారు చిన్హ సిన్హ వెల్లడించారు. కిషన్ నాయక్ ఇటీవల వరకు మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లాలో డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్‌గా పని చేసి, ఏడాది క్రితమే మహబూబ్‌నగర్‌కు బదిలీ అయ్యారని అధికారులు తెలిపారు.

ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. ఒక ప్రభుత్వ అధికారి ఇంత భారీ స్థాయిలో ఆస్తులు కూడబెట్టడంపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. “ఒక్కరిని పట్టుకుంటేనే వందల కోట్ల ఆస్తులు బయటపడుతున్నాయి.. మరి ఇలాంటి అవినీతి తిమింగలాలు ఇంకెంతమంది ఉన్నారు?” అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అధికారులు, రాజకీయ నాయకులపై నమ్మకం కోల్పోతున్నామని, వ్యవస్థలో సంస్కరణలు అవసరమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి రవాణా శాఖలో వెలుగులోకి వచ్చిన ఈ అవినీతి బండారం రాష్ట్ర పరిపాలనపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని, ఏసీబీ విచారణలో మరిన్ని సంచలన విషయాలు బయటపడే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *