ఫోన్ ట్యాపింగ్ కేసు తుది దశకు చేరిందా? కేసీఆర్–హరీష్ రావులకు సిట్ నోటీసులు దాదాపు ఖాయం
తెలంగాణను కుదిపేస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరిగినట్లు తెలుస్తోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు ఇప్పుడు తుది అంకానికి చేరిందన్న సంకేతాలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు పేర్లు వాంగ్మూలాల్లో రావడంతో వారిని విచారణకు పిలిచే అంశం దాదాపు ఖరారైనట్టేనని సమాచారం.
ఈ కేసులో కీలక సాక్షిగా మారిన నందకుమార్ వాంగ్మూలం సిట్‌కు ప్రధాన ఆధారంగా మారింది. తన ఫోన్‌ను అక్రమంగా ట్యాప్ చేసి, ఆ ఆడియోలను నాటి సీఎం కేసీఆర్ బహిరంగంగా మీడియా సమావేశంలో విడుదల చేశారని నందకుమార్ సిట్ అధికారులకు వెల్లడించారు. ఈ విషయమై అప్పట్లో డీజీపీ రవిగుప్తకు ఫిర్యాదు చేసినా స్పందన లేదని ఆయన ఆరోపించారు. నందకుమార్ ఫోన్ నిజంగా ట్యాప్ అయ్యిందని నిర్ధారణ కావడంతో ఈ వ్యవహారం ఎవర ఆదేశాలపై జరిగిందన్న దానిపై సిట్ దృష్టి సారించింది.
ఇక ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును 14 రోజుల పోలీస్ కస్టడీలో విచారించిన సిట్, చివరి రోజు ఆయనపై ఒత్తిడి పెంచే వ్యూహాన్ని అమలు చేసినట్లు తెలుస్తోంది. ప్రభాకర్ రావుతో పాటు ఆయన కుమారుడు నిషాంత్ రావును కూడా విచారించి కీలక సమాచారం రాబట్టినట్లు సమాచారం. అంతేకాకుండా భుజంగరావు, తిరుపతన్న, రాధాకిషన్ రావు, మీడియా సంస్థ అధిపతి శ్రవణ్ రావు తదితర నిందితులతో ప్రభాకర్ రావును ముఖాముఖి విచారణకు గురి చేసినట్లు తెలిసింది.
గతంలో ఇచ్చిన వాంగ్మూలాలకు నిందితులు కట్టుబడి ఉన్నారా లేదా అన్నదానిపై సిట్ అధికారులు స్పష్టత తీసుకున్నారని సమాచారం. శ్రవణ్ రావు కోర్టులో తన వాంగ్మూలాన్ని సవాలు చేసిన నేపథ్యంలో, కాల్ డేటా రికార్డులు, సెల్ టవర్ లొకేషన్ వివరాలు, ఆర్థిక లావాదేవీల ఆధారాలతో విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో మరో కీలక అంశంగా ఎస్ఐబీతో పాటు ఇంటెలిజెన్స్ శాఖ నుంచే అక్రమ ట్యాపింగ్ జరిగిందన్న ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. 2020 జూన్‌లో ప్రభాకర్ రావు రిటైర్ అయినప్పటికీ, ఆయనను ఓఎస్డీగా నియమించి కీలక ఇంటెలిజెన్స్ బాధ్యతలు అప్పగించడంతో ట్యాపింగ్ విభాగానికి ఆయనకు నేరుగా యాక్సెస్ లభించినట్లు సిట్ గుర్తించింది. దీని ద్వారా పెద్ద స్థాయిలో అక్రమ నిఘా సాగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
బీఆర్ఎస్ పాలనలో దాదాపు 6,000 ఫోన్ నంబర్లు ట్యాప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం సీజ్ చేసిన హార్డ్ డిస్క్‌లలో ఇంకా అనేక ఫోన్ నంబర్లు, డేటా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. నిజానికి ఇంకా ఎంతమంది ఫోన్లు ట్యాప్ అయ్యాయన్నది తేలాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో సిట్ బృందంతో ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ఇటీవల భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. సిట్ చీఫ్ సజ్జనార్‌తో పాటు ఇతర అధికారులు కేసు పురోగతిపై చర్చించినట్లు సమాచారం. ప్రభాకర్ రావు విచారణ నివేదికను సుప్రీంకోర్టుకు సమర్పించాల్సి ఉండటంతో సిట్ తుది నివేదిక సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
మొత్తంగా చూస్తే ఫోన్ ట్యాపింగ్ కేసు ఇప్పుడు రాజకీయంగా అత్యంత కీలక దశకు చేరింది. కేసీఆర్, హరీష్ రావులను కేవలం ప్రశ్నించి వదిలేస్తారా? లేక కస్టడీ, రిమాండ్ వరకు వ్యవహారం వెళ్తుందా? అన్నది రాబోయే రోజుల్లో తేలనుంది. తెలంగాణ రాజకీయాల్లో ఈ కేసు ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

