యూరియా, కరెంట్, కాలువల పూడికతో రైతులు ఆందోళనలో… దుబ్బాక–సిద్దిపేట రైతుల సమస్యలపై అసెంబ్లీలో తీవ్ర ఆవేదన

తెలంగాణ అసెంబ్లీలో దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా రైతుల సమస్యలపై ఎమ్మెల్యే తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. యూరియా కొరత, కరెంట్ సమస్యలు, కాలువల పూడిక, సాగునీటి నిర్వహణలో నిర్లక్ష్యం కారణంగా రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని సభా వేదికగా వివరించారు.

హుజురాబాద్ నియోజకవర్గ పరిధిలోని కల్వల ప్రాజెక్ట్ గురించి ప్రస్తావిస్తూ, 2023లో భారీ వర్షాల కారణంగా ప్రాజెక్ట్ దెబ్బతిందని, అప్పట్లో కేసీఆర్ నాయకత్వంలో రూ.70 కోట్లతో డీపీఆర్ పంపించినా ఇప్పటివరకు అది పెండింగ్‌లోనే ఉందన్నారు. ఆ ప్రాజెక్ట్ పూర్తయితే సుమారు 6–7 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు.

ఇటీవల తమ నియోజకవర్గంలో నిర్మించిన ఒక చెక్‌డ్యామ్‌ను బాంబులతో పేల్చిన ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. ఇది మేడిగడ్డ ఘటనను గుర్తుకు తెస్తోందని అన్నారు.

దుబ్బాక నియోజకవర్గంలోని ఎనిమిది మండలాలు పూర్తిగా వ్యవసాయంపై ఆధారపడి ఉన్నాయని, గత యాసంగితో పోలిస్తే ఈసారి వరి నాట్లు రెట్టింపుగా పెరిగాయని తెలిపారు. ఈ పరిస్థితుల్లో యూరియా సరఫరాపై రైతుల్లో తీవ్ర భయం నెలకొన్నదన్నారు. యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండడం గ్రామీణ రైతులకు సాధ్యం కాదని స్పష్టం చేశారు.

కరెంట్ సరఫరా రోజుకు కేవలం 8–9 గంటలకే పరిమితం కావడం వల్ల నాట్ల సమయంలో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వేసవి వస్తే పరిస్థితి మరింత దారుణంగా మారుతుందని హెచ్చరించారు. చాలా గ్రామాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు, వైర్లు లేకపోవడం, బడ్జెట్ లేదని అధికారులు చేతులెత్తేయడం రైతులను నిరాశకు గురి చేస్తోందన్నారు.

మల్లన్న సాగర్, కొండపోచమ్మ, రంగనాయక్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటికి సంబంధించిన కాలువలు పూడికతో నిండిపోయాయని, వాటిని వెంటనే శుభ్రం చేయకపోతే ఈ సంవత్సరం పంటలు నష్టపోతాయని చెప్పారు. రెండు సంవత్సరాలుగా ఇరిగేషన్ శాఖ నుంచి సరైన రివ్యూ మీటింగ్ కూడా జరగలేదని విమర్శించారు.

కాళేశ్వరం ద్వారా నిర్మించిన మూడు ప్రాజెక్టులపై ఆధారపడి దుబ్బాకలో లక్షల ఎకరాల సాగు జరుగుతోందని, నీరు ఉన్నా కాలువల నిర్వహణ లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. గతంలో రైతులే సొంత డబ్బులతో తాత్కాలిక కాలువలు వేసుకున్న పరిస్థితిని గుర్తు చేశారు.

ఇక ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత కూడా రైస్ మిల్లుల వద్ద అన్‌లోడ్ కాకుండా నిలిచిపోవడం, తరుగు పేరుతో కట్టింగ్ కొనసాగడం వంటి సమస్యలపై కూడా ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

యూరియా, కరెంట్, సాగునీరు — ఈ మూడు రైతులకు ప్రాణప్రదమని పేర్కొంటూ, ఇప్పటికైనా ఇరిగేషన్, వ్యవసాయ శాఖ మంత్రులు సిద్దిపేట జిల్లా, దుబ్బాక నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టి రైతులను కాపాడాలని ఆయన సభా వేదికగా విజ్ఞప్తి చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *