కోదాడలో జరిగిన కర్ల రాజేష్ లాక్‌అప్ డెత్ కేసులో ఇది పూర్తిగా పోలీసుల చేతిలో జరిగిన హత్యేనని ఎంఆర్పీఎస్ నేతలు తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ మేరకు నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వారు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా జరుగుతున్న అన్ని ఎన్‌కౌంటర్లను పోలీసు హత్యలుగా చెప్పలేముగానీ, లాక్‌అప్ డెత్‌లన్నీ మాత్రం వందకు వంద శాతం పోలీసుల హత్యలేనని స్పష్టం చేశారు.
2025 సంవత్సరంలోనే ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1650కి పైగా కస్టోడియల్ మరణాలు జరిగాయని, ఇది పోలీసు వ్యవస్థ వైఫల్యానికి స్పష్టమైన నిదర్శనమని పేర్కొన్నారు. నేరాలను నియంత్రించాల్సిన పోలీసు వ్యవస్థే నేరాలకు పాల్పడుతోందని, ముఖ్యంగా పేద, దళిత, బలహీన వర్గాలపైనే ఈ దాడులు జరుగుతున్నాయని విమర్శించారు.
కోడాడకు చెందిన దళిత యువకుడు కర్ల రాజేష్ అక్రమ నిర్బంధంలో పోలీసుల చిత్రహింసల వల్ల అనారోగ్యానికి గురై, చివరకు హైదరాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నవంబర్ 16న మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనకు చిలుకూరు పోలీస్ స్టేషన్ ఎస్ఐ సురేష్ రెడ్డి ప్రధాన బాధ్యుడని, నిర్లక్ష్యంగా వ్యవహరించిన సీఐ, కేసును కనుమరుగుచేయడానికి ప్రయత్నించిన డీఎస్పీ, ఎస్పీ స్థాయి అధికారుల వరకు అందరూ బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రాజేష్‌ను కేసు నమోదు కాకముందే అక్రమంగా అదుపులోకి తీసుకుని చిత్రహింసలు పెట్టారని, కోర్టు ప్రాంగణంలోనే అనుమతి లేకుండా ఇంజెక్షన్ ఇవ్వించి జైలుకు తరలించడం ద్వారా నిజాన్ని దాచే ప్రయత్నం చేశారని ఆరోపించారు. ఈ కేసులో తయారు చేసిన రిమాండ్ రిపోర్ట్‌లో అనేక విరుద్ధాలు, తప్పులు ఉన్నాయని, నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు తొందరపాటుతో నివేదికలు తయారు చేశారని తెలిపారు.
ఇంతటి తీవ్రమైన ఆరోపణలు ఉన్నప్పటికీ ఎస్ఐ సురేష్ రెడ్డిని ఇప్పటివరకు సస్పెండ్ చేయకపోవడం వెనుక కులతత్వం పనిచేస్తోందని ఎంఆర్పీఎస్ ఆరోపించింది. అదే సమయంలో ఒక బీసీ సీఐని మాత్రమే సస్పెండ్ చేయడం స్పష్టమైన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని విమర్శించారు.
ఈ ఘటనపై నిపుణులైన డాక్టర్ల బృందంతో రీ–పోస్టుమార్టం నిర్వహించాలని, ప్రధాన నిందితుడైన ఎస్ఐని వెంటనే అరెస్ట్ చేసి సస్పెండ్ చేయాలని, అలాగే సిట్టింగ్ హైకోర్టు న్యాయమూర్తితో న్యాయ విచారణ జరపాలని డిమాండ్ చేశారు.
జనవరి 10న కోదాడలో కర్ల రాజేష్ సంతాప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. అంతకుముందు న్యాయం జరగకపోతే, ఈ ఉద్యమాన్ని తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తామని, ఇది ఒక పెద్ద ప్రజా ఉద్యమంగా మారుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. దళితుల ప్రాణాలకు విలువ లేకుండా పోతే, ఎంఆర్పీఎస్ రాజీలేని పోరాటానికి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.

