శివాజీ – అనసూయ వివాదం ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. హీరోయిన్లు వేసుకునే బట్టలపై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద చర్చకు దారి తీయగా, వాటిపై అనసూయ బహిరంగంగా స్పందించడం ఈ వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. ఈ విషయంలో కొంతమంది శివాజీకి మద్దతుగా నిలిస్తే, మరికొందరు అనసూయను సమర్థిస్తూ సోషల్ మీడియాలో తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు స్పందించగా, తాజాగా సీనియర్ నటుడు సుమన్ కూడా ఈ అంశంపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు.
సుమన్ మాట్లాడుతూ, శివాజీ ఉపయోగించిన పదాలు సరైనవి కావని స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా అలాంటి మాటలు మాట్లాడకూడదని, అది తప్పేనని అభిప్రాయపడ్డారు. అయితే శివాజీ తన తప్పును గుర్తించి క్షమాపణ చెప్పారని కూడా గుర్తు చేశారు. ఈ వివాదాన్ని ఒక్క కోణంలోనే కాకుండా మరో కోణంలో కూడా చూడాలని సూచించారు.
సినిమా జీవితం ఒకటైతే నిజ జీవితం మరోటని సుమన్ అన్నారు. సినిమాల్లో పాత్ర అవసరం కోసం నటీనటులు ప్రత్యేకమైన బట్టలు ధరించాల్సి వస్తుందని, కానీ అదే విధంగా బయట కూడా కనిపించాల్సిన అవసరం లేదని తెలిపారు. గతంలో జయమాలిని, విజయలలిత, సిల్క్ స్మిత లాంటి నటీమణులు సినిమాల్లో బోల్డ్ పాత్రలు చేసినప్పటికీ, బయట మాత్రం చాలా సింపుల్‌గా ఉండేవారని గుర్తు చేశారు. తాను జ్యోతి లక్ష్మి, జయమాలిని, సిల్క్ స్మిత వంటి నటీమణులతో కలిసి పని చేశానని చెప్పిన సుమన్, వారు షూటింగ్ సెట్స్‌ను దేవాలయంలా భావించి, పూర్తిగా ప్రొఫెషనల్‌గా వ్యవహరించేవారని అన్నారు.
బయట ప్రపంచంలో రకరకాల మనస్తత్వాలు ఉన్నాయని, ఏదైనా జరిగాక బాధపడటం వల్ల ప్రయోజనం ఉండదని సుమన్ అభిప్రాయపడ్డారు. సినిమా వేరు, వ్యక్తిగత జీవితం వేరు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని సూచించారు. పబ్లిక్‌లో కనిపించే వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని, ఇప్పటి యంగ్ జనరేషన్‌కు సరైన మార్గనిర్దేశం కొరవడుతోందని తెలిపారు. అనుభవం, మెచ్యూరిటీ వచ్చిన తర్వాతే ఇలాంటి విషయాలపై స్పష్టత వస్తుందని చెప్పారు.
సుమన్ చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఈ వ్యాఖ్యలు శివాజీ – అనసూయ వివాదానికి కొత్త కోణాన్ని చూపించాయని అంటుండగా, మరికొందరు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ఈ అంశం టాలీవుడ్‌లో ఇంకా చర్చనీయాంశంగానే కొనసాగుతోంది.

