నందమూరి కుటుంబం నుంచి మరో తరం వెండితెరకు పరిచయం కానుందా..? నటసింహం నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ అరంగేట్రంపై టాలీవుడ్లో మరోసారి చర్చ మొదలైంది. గత కొన్నేళ్లుగా మోక్షజ్ఞ ఎంట్రీపై అనేక ఊహాగానాలు వినిపించినప్పటికీ, అధికారిక ప్రకటన మాత్రం ఇప్పటివరకు రాలేదు. అయినా నందమూరి అభిమానులు మాత్రం ఆయనను తెరపై చూడాలనే ఆశతో ఎదురుచూస్తూనే ఉన్నారు.
తాజా సమాచారం ప్రకారం, మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై బాలకృష్ణ కీలక నిర్ణయాలు తీసుకున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సరైన సమయం, సరైన కథ, సరైన దర్శకుడితోనే మోక్షజ్ఞను లాంచ్ చేయాలన్న ఆలోచనలో బాలయ్య ఉన్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే తొలి సినిమాకు దర్శకుడిగా క్రిష్ జాగర్లమూడిని ఫైనల్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. కంటెంట్‌కు ప్రాధాన్యం ఇచ్చే దర్శకుడిగా క్రిష్‌కు ఉన్న పేరే ఈ కాంబినేషన్‌పై ఆసక్తిని పెంచుతోంది.
ఇటీవల మోక్షజ్ఞ లుక్స్ సోషల్ మీడియాలో వైరల్ కావడం కూడా ఈ వార్తలకు బలం చేకూర్చింది. గతంలో కాస్త బరువుగా కనిపించిన మోక్షజ్ఞ, ఇప్పుడు పూర్తిగా ఫిట్ అండ్ స్టైలిష్ లుక్‌లో దర్శనమిస్తున్నారు. ఈ ట్రాన్స్ఫర్మేషన్ చూసిన అభిమానులు ఆయన అరంగేట్రం సింపుల్‌గా ఉండదని అభిప్రాయపడుతున్నారు. స్టార్ కిడ్ అయినప్పటికీ, కథకు ప్రాధాన్యం ఉన్న సినిమాతోనే ఎంట్రీ ఇవ్వాలన్న ఆలోచనలో ఉన్నారని టాక్.
గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ డెబ్యూ మూవీ ఉంటుందని అధికారికంగా ప్రకటించినప్పటికీ, ఆ ప్రాజెక్ట్ వివిధ కారణాల వల్ల ముందుకు సాగలేదు. షూటింగ్ మొదలవుతుందనే వార్తలు వచ్చిన ప్రతిసారీ వాయిదాలు పడటంతో అభిమానుల్లో నిరాశ వ్యక్తమైంది. అయితే తాజా పరిణామాలతో ఆ నిరాశకు చెక్ పడే అవకాశం ఉందని అంటున్నారు.
ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం, కొత్త ఏడాది ప్రారంభంలోనే క్రిష్–మోక్షజ్ఞ సినిమా సెట్స్‌పైకి వెళ్లేలా ప్రణాళికలు రూపొందుతున్నాయి. 2026 చివరి నాటికి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మాస్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాలతో పాటు క్లాస్ టచ్ కూడా ఉండేలా కథను రూపొందించాలని బాలకృష్ణ దర్శకుడికి సూచించినట్లు సమాచారం.
మొత్తానికి నందమూరి నెక్స్ట్ జనరేషన్ వెండితెరపైకి రావడానికి రంగం సిద్ధమవుతోందన్న భావనతో అభిమానుల్లో అంచనాలు పెరుగుతున్నాయి. మోక్షజ్ఞ అరంగేట్రం నందమూరి అభిమానులకు ఎంతవరకు పండుగ వాతావరణాన్ని తీసుకొస్తుందో చూడాలి.

