రెవెన్యూ పేరుతో యూనివర్సిటీలను రియల్ ఎస్టేట్ హబ్‌లుగా మార్చే ప్రయత్నం: మౌలానా ఆజాద్ యూనివర్సిటీ విద్యార్థుల ఆగ్రహం

తెలంగాణ ప్రభుత్వం రెవెన్యూ జనరేషన్ పేరుతో విద్యాసంస్థల భూములపై కన్నేయడం తక్షణమే ఆపాలని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీ విద్యార్థులు, పరిశోధకులు డిమాండ్ చేశారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే క్యాంపస్ బయట చేయాలని, యూనివర్సిటీ భూములను తాకొద్దని ప్రభుత్వానికి స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.

ఇది కేవలం రొటీన్ సర్వే అంటూ టూరిజం మంత్రి చేసిన వ్యాఖ్యలను విద్యార్థులు ఖండించారు. ఇదే తరహా ప్యాటర్న్‌ను గతంలో బిజినెస్ స్కూల్స్, సెంట్రల్ యూనివర్సిటీల విషయంలో కూడా ప్రభుత్వం అనుసరించిందని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు జరిగిన త్యాగాల పునాదులపైనే ఈ రాష్ట్రం నిలిచిందని, ఆ పునాదులనే రియల్ ఎస్టేట్ దృష్టితో విచ్ఛిన్నం చేయడం సరికాదన్నారు.

యూనివర్సిటీ భూములపై నోటీసులు ఇచ్చిన తర్వాత అన్ని స్టూడెంట్ గ్రూప్స్‌ను ఏకం చేసి పబ్లిక్ కాల్ ఇచ్చామని, ఆ తర్వాత అనామక నంబర్ల నుంచి బెదిరింపులు వచ్చాయని విద్యార్థులు తెలిపారు. పీహెచ్‌డీ స్కాలర్స్‌ను లక్ష్యంగా చేసుకుని ‘కేరియర్ ఉండదు, చదువు తర్వాత ఏమీ చేయలేరు’ అనే స్థాయిలో బెదిరింపులు రావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు.

ఇది బీజేపీ విధానమా? కాంగ్రెస్ విధానమా? అనే తేడా లేకుండా, కేంద్రం–రాష్ట్రం రెండింట్లోనూ ఒకే రకమైన విద్యావ్యతిరేక పాలసీలు కొనసాగుతున్నాయని విమర్శించారు. సెంట్రల్ యూనివర్సిటీని డిస్టర్బ్ చేయాల్సి వస్తే పెద్ద ఎత్తున ఉద్యమాలకు వెనకాడబోమని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్థుల పాత్ర ఎంత కీలకమో ప్రభుత్వం మర్చిపోవద్దన్నారు.

మౌలానా ఆజాద్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన నోటీసులపై కూడా కీలక విషయాలు బయటపడ్డాయి. యూనివర్సిటీ వద్ద 50 ఎకరాల ఖాళీ భూమి ఉందని ప్రభుత్వం భావిస్తోందని, వాస్తవానికి ఎంటీ స్పేస్ కేవలం 32 ఎకరాలే ఉందని విద్యార్థులు స్పష్టం చేశారు. అదీ పూర్తిగా ఎకోసిస్టమ్‌కు చెందిన భూమి కావడంతో అక్కడ భారీ నిర్మాణాలు సాధ్యం కాదన్నారు.

యూనివర్సిటీ క్యాంపస్‌లో బయోలాజికల్, బోటానికల్ విలువలు కలిగిన ప్రాంతాలు ఉండటంతో అంతర్జాతీయ స్థాయి అవార్డులు కూడా వచ్చాయని గుర్తు చేశారు. అలాంటి బ్యూటిఫుల్ క్యాంపస్‌ను రియల్ ఎస్టేట్ హబ్‌గా మార్చే ప్రయత్నం విద్యా భవిష్యత్తుపై దాడి అని ఆరోపించారు.

ఒక ఎడ్యుకేటెడ్ వ్యక్తి లీడర్ అయితే విద్య గురించి ఆలోచిస్తాడు. ఒక రియల్ ఎస్టేట్ బ్రోకర్ సీఎం అయితే రియల్ ఎస్టేట్ గురించే ఆలోచిస్తాడు” అంటూ ప్రభుత్వం తీరుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాత్కాలిక రెవెన్యూ కోసం భవిష్యత్ తరాల విద్యను తాకట్టు పెట్టడం నేరమన్నారు.

రాహుల్ గాంధీ ఢిల్లీలో కూర్చొని విద్యా వ్యవస్థపై ప్రసంగాలు చేస్తారని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పూర్తిగా వ్యతిరేక విధానాలు అమలు చేస్తోందని విమర్శించారు. అసెంబ్లీలో విద్యకు పెద్ద బడ్జెట్ ఇస్తున్నామని చెప్పుకుంటున్న ప్రభుత్వం, యూనివర్సిటీలకు నీరు, రవాణా వంటి మౌలిక సదుపాయాలు కూడా ఇవ్వడం లేదన్నారు.

అదానీ, అంబానీలకు కేంద్రంలో భూములు అమ్ముతున్నారని విమర్శించే కాంగ్రెస్, రాష్ట్రంలో మాత్రం స్థానిక రియల్ ఎస్టేట్ శక్తులకు యూనివర్సిటీ భూములు అమ్మే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఈ దురుద్దేశానికి వ్యతిరేకంగా స్టూడెంట్ కమ్యూనిటీ మొత్తం ఐక్యంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.

ఈ ఉద్యమానికి మద్దతుగా నిలిచిన కేటీఆర్‌కు విద్యార్థులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. “కేటీఆర్ ట్వీట్ చేయకపోతే ఈ ఉద్యమం అప్పుడే ఆగిపోయేది. ఆయన మద్దతుతోనే ఈ ఇష్యూ నేషనల్ మీడియాలోకి వెళ్లింది” అని చెప్పారు. దాని ప్రభావంతో హైకమాండ్ నుంచి సీఎం రేవంత్ రెడ్డికి కాల్ రావడం, అధికారులు వెనక్కి తగ్గే భాషలో లేఖలు రాయడం మొదలుపెట్టారని తెలిపారు.

కేసీఆర్, కేటీఆర్ సహా బీఆర్ఎస్ నాయకత్వానికి ధన్యవాదాలు తెలుపుతూ, యూనివర్సిటీ భూముల రక్షణ కోసం పోరాటం కొనసాగుతుందని విద్యార్థులు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *