తెలంగాణ రాజకీయాల్లో మరో భారీ కుంభకోణం వెలుగులోకి వస్తోందా? రామగుండంలోని 107 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్‌తో పాటు సింగరేణి టెండర్లలో సుమారు ₹540 కోట్ల అవినీతి జరిగిందన్న ఆరోపణలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేస్తున్నాయి. ఈ స్కామ్ వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బామర్ది పాత్ర ఉందన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు ఈ అంశంపై తీవ్ర విమర్శలు చేశారు. మూడు వేరు వేరు సైట్లలో ఏర్పాటు చేయాల్సిన సోలార్ ప్లాంట్లను కలిపి ఒక్కటే టెండర్ పిలవడం ద్వారా పోటీని కుదించారని, ముఖ్యంగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలను బిడ్డింగ్ నుంచి తప్పించేందుకు ఇలా చేశారని ఆరోపించారు. అలాగే ‘సైట్ విజిట్ సర్టిఫికేట్’ అనే నిబంధన పెట్టి తమ అనుమానితులకు లాభం చేకూర్చారని తెలిపారు.
టెండర్లలో 30 శాతం అధిక ధరకు జిలెటిన్ స్టిక్స్ కొనుగోలు చేయడంపై డైరెక్టర్లపై ఒత్తిడి తెచ్చినట్టు, ఓబి (Over Burden) టెండర్లలోనూ గోల్మాల్ జరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. శ్రీరాంపూర్ ఓబి టెండర్‌ను రేవంత్ బామర్ది కోసం ఏడు సార్లు వాయిదా వేసినట్టు విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ వ్యవహారం బయటకు రాకుండా చేయాలని ఒత్తిడి తెస్తున్నారని, కానీ సింగరేణిలో జరిగిన అక్రమాలు కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి బీజం వేస్తాయని హరీష్ రావు హెచ్చరించారు. ఈ అంశంపై వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి స్పందించి, సిట్టింగ్ జడ్జీ లేదా సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదిలా ఉండగా, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క సింగరేణి మాజీ సీఎండి బలరాం నాయక్‌తో దాదాపు ఆరు గంటల పాటు రహస్య సమావేశం నిర్వహించినట్టు సమాచారం. ఈ భేటీలో ఓపెన్ కాస్ట్ గనులు, ఓబి టెండర్లు, కోల్ ట్రాన్స్పోర్ట్ బీడ్లు, జిలెటిన్ స్టిక్స్ కాంట్రాక్టులపై లోతైన చర్చ జరిగినట్టు తెలిసింది. అనంతరం ప్రస్తుత సీఎండి ఫైల్స్‌తో హాజరుకావడం రాజకీయ వర్గాల్లో మరింత ఆసక్తిని రేపింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలలకే ముఖ్యమంత్రి తన బామర్దిని సింగరేణిలోకి చొప్పించారని, సైట్ విజిట్ విధానాన్ని ఆయుధంగా మార్చుకుని వరుసగా ఓపెన్ కాస్ట్ పనులు దక్కించుకున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
మొత్తానికి, సోలార్ పవర్ ప్లాంట్, బొగ్గు గనులు, టెండర్లు, కాంట్రాక్టులు—ఈ అన్నిటి వెనుక బహుళ రాజకీయ పార్టీలు కుమ్మక్కై పనిచేస్తున్నాయన్న ఆరోపణలు ప్రజల్లో అనుమానాలను పెంచుతున్నాయి. నిజంగా ఈ స్కామ్‌లపై స్వతంత్ర దర్యాప్తు జరుగుతుందా? లేక రాజకీయ ఆరోపణలకే పరిమితమవుతుందా? అన్నది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

