యాచారం గ్రామానికి చెందిన నక్కలి అశోక్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నమోదైన కేసు సంచలన విషయాలను వెలుగులోకి తెచ్చింది. అప్పుల బాధతో తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారనే మొదటిప్రాథమిక సమాచారం అనుమానాస్పదంగా మారడంతో పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు.
ఫిర్యాదులో భాగంగా బంటవరం ఎస్ఐ, దారూర్ సీఐలు సంఘటన స్థలానికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించగా అక్కడ రెండు ఇంజెక్షన్లు లభ్యమయ్యాయి. దీంతో ఇది సాధారణ మృతి కాదని భావించిన పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.
దర్యాప్తులో మృతుల కుమార్తె నక్కల సురేఖపై అనుమానం వ్యక్తమైంది. ఆమెను విచారించగా, తాను తన తల్లిదండ్రులకు ఇంజెక్షన్లు ఇచ్చి చంపినట్లు పోలీసుల ఎదుట నేరాన్ని ఒప్పుకుంది. సురేఖ సంగారెడ్డిలోని సహస్ర హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తూ, ఐసీయూ ఇన్చార్జ్గా ఉన్న సమయంలో ఎక్కువ మోతాదులో ఇంజెక్షన్లు ఇస్తే వెంటనే మరణం సంభవిస్తుందని తెలుసుకుంది.
ప్రేమ వివాహానికి తల్లిదండ్రులు అంగీకరించకపోవడమే ఈ దారుణానికి కారణమని పోలీసుల విచారణలో తేలింది. తాను ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలంటే తల్లిదండ్రులు అడ్డుగా ఉన్నారని భావించిన సురేఖ, వారిని తొలగించుకోవాలనే ఉద్దేశంతో ఈ హత్యకు పాల్పడినట్లు వెల్లడైంది.
ఈ నెల 24వ తేదీ సాయంత్రం సంగారెడ్డిలోని హాస్పిటల్ నుంచి యాచారం గ్రామానికి వచ్చిన సురేఖ, రాత్రి భోజనం అనంతరం తల్లికి నడుము నొప్పుల పేరుతో ఇంజెక్షన్ ఇచ్చింది. అధిక మోతాదులో ఇచ్చిన ఇంజెక్షన్ కారణంగా తల్లి అక్కడికక్కడే మరణించింది. అనంతరం అదే విధంగా తండ్రికి కూడా ఇంజెక్షన్ ఇవ్వడంతో ఆయన కూడా మృతి చెందాడు.
భయంతో సురేఖ తన అన్నకు ఫోన్ చేసి తల్లిదండ్రులు చనిపోయారని చెప్పగా, గ్రామస్థులు వచ్చి వారిని మార్పల్లి హాస్పిటల్కు తరలించారు. అయితే అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ కేసులో ప్రేమించిన యువకుడికి ఎలాంటి పాత్ర లేదని, అతనికి ఈ ఘటనతో సంబంధం లేదని పోలీసులు స్పష్టం చేశారు. వేగంగా విచారణ పూర్తి చేసి మూడో రోజే కేసును డిటెక్ట్ చేసిన దారూర్ సీఐ, బంటవరం ఎస్ఐ, సిబ్బందిని వికారాబాద్ సబ్ డివిజన్ పోలీసులు అభినందించారు.

