ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) మరోసారి నోటీసులు జారీ చేసింది. రేపు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ నందినగర్‌లోని ఆయన అధికారిక నివాసంలోనే విచారణకు హాజరు కావాలని స్పష్టంగా ఆదేశించింది.
ఇటీవల సిట్ నోటీసులకు స్పందించిన కేసీఆర్, మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పార్టీ అధ్యక్షుడిగా తనపై బాధ్యతలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంటూ, మరొక అనుకూలమైన తేదీ ఇవ్వాలని లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సిట్ మరో తేదీపై పునర్విచారణ చేస్తుందని రాజకీయ వర్గాలు భావించాయి. అయితే, అనూహ్యంగా శుక్రవారం రాత్రి సుమారు 8.30 గంటలకు సిట్ అధికారులు కేసీఆర్ నివాసానికి వెళ్లి మరోసారి నోటీసులు ఇచ్చారు.
ఈసారి విచారణ స్థలాన్ని కూడా స్పష్టంగా పేర్కొంటూ, నందినగర్ నివాసంలోనే విచారణ జరగుతుందని నోటీసులో వెల్లడించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో విచారణ జరపాలన్న కేసీఆర్ ప్రతిపాదనను సిట్ తిరస్కరించింది. ఎలక్ట్రానిక్, భౌతిక ఆధారాలను తరలించడం సాధ్యం కాదని అధికారులు స్పష్టం చేశారు.
పంజగుట్ట పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైమ్ నంబర్ 243/2024 కేసులో, సెక్షన్ 160 సీఆర్పీసీ కింద సాక్షిగా విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్నారు. కేసీఆర్ ఎన్నికల అఫిడవిట్లు, శాసనసభ అధికారిక రికార్డుల ప్రకారం ఆయన నివాసం నందినగర్గా నమోదై ఉండటంతో, చట్టపరంగా అదే విచారణ స్థలమని సిట్ వివరించింది.
నోటీసులు అందించేందుకు అధికారులు వచ్చిన సమయంలో, కేసీఆర్ నివాసంలో కేవలం ప్రైవేట్ సెక్యూరిటీ మాత్రమే ఉండటంతో, నోటీసులను గోడకు అంటించినట్లు సిట్ అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై హైడ్రామా నెలకొందన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి.
ఇదే సమయంలో, కేసీఆర్ విచారణ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు రోడ్లపైకి వచ్చే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి హెచ్చరించినట్లు సమాచారం. శాంతిభద్రతల పరంగా అప్రమత్తంగా ఉండాలని నివేదిక అందినట్టు తెలుస్తోంది.
సిట్ నోటీసులపై ఇప్పటివరకు కేసీఆర్ గానీ, బీఆర్ఎస్ ప్రధాన నాయకత్వం గానీ అధికారికంగా స్పందించలేదు. అయితే, కేసీఆర్ సహకరిస్తారా? మరోసారి సమయం కోరుతారా? లేక నోటీసులను హైకోర్టులో సవాలు చేస్తారా? అనే అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
ఇప్పటికే కేసీఆర్ పలువురు న్యాయ నిపుణులతో చర్చలు జరిపినట్లు సమాచారం. నోటీసులపై లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసే అంశంపైనా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తోంది. మరోవైపు, రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ కేసును ఉపయోగిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు మొదటి నుంచి ఆరోపణలు చేస్తున్నారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను ప్రస్తుతం నిందితుడిగా కాకుండా సాక్షిగా మాత్రమే విచారిస్తున్నారని, అందువల్ల అరెస్టు చేసే పరిస్థితి లేదని న్యాయవర్గాలు చెబుతున్నాయి. అయితే, కేసీఆర్ విచారణ తర్వాత ఎలాంటి కీలక సమాచారం బయటకు వస్తుందన్న అంశంపై రాజకీయ, ఇంటెలిజెన్స్ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
రేపు మధ్యాహ్నం మూడు గంటలకు జరగనున్న ఈ విచారణకు కేసీఆర్ హాజరవుతారా లేదా అన్నదే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ప్రధాన చర్చాంశంగా మారింది.

